V6 News

బాయ్.. కాస్తా కూల్‎గా ఉండమని చెప్పినా: హార్ధిక్‎తో హాట్ డిస్కషన్‎పై తిలక్ క్లారిటీ

బాయ్.. కాస్తా కూల్‎గా ఉండమని చెప్పినా: హార్ధిక్‎తో హాట్ డిస్కషన్‎పై తిలక్ క్లారిటీ

ముంబై: గుజరాత్ టైటాన్స్‎తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే అజేయ శతకంతో వీరవిహారం చేసి ముంబైకు ఘన విజయాన్ని అందించాడు. అయితే, ఈ మ్యాచులో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తిలక్ వర్మ మొదట చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. అభిమానులకు కూడా ఆ బ్యాటింగ్ చూసి అబ్బా ఇదేమీ ఆట రా సామీ అనిపించింది. దీంతో స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయంలో తిలక్ వర్మతో ముంబై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా చాలా అగ్రెసివ్‎గా మాట్లాడాడు.

ఆ తర్వాత నుంచి తిలక్ పునకాలు వచ్చిన మాదిరిగా రెచ్చిపోయి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో తిలక్ వర్మతో పాండ్యా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంతకీ పాండ్యా తిలక్‏ను మోటివేట్ చేశాడా.. లేక స్లోగా బ్యాటింగ్ చేస్తున్నావని చివాట్లు పెట్టాడా అని నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై తిలక్ క్లారిటీ ఇచ్చాడు.. 

బాయ్.. కాస్తా కూల్‎గా ఉండు.. నేను చూస్కుంటా: తిలక్

మ్యాచ్ మధ్యలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో జరిగిన అగ్రెసివ్ డిస్కషన్ గురించి తిలక్ వర్మ వివరణ ఇచ్చాడు. ‘‘హార్ధిక్ బాయ్ చాలా ఉత్సాహవంతుడు. మ్యాచ్ సమయంలో ఆయన ఎనర్జీటిక్‎గా ఉండటమే కాకుండా నన్ను కూడా చాలా ప్రోత్సాహించాడు. నువ్వు ఆడాగలవు.. నువ్వు ఆడతావు అంటూ పదే పదే మోటివేట్ చేశాడు. కానీ ఆ ఒత్తిడి సమయంలో నేను ఏకాగ్రతతో ఉండాలి కాబట్టి బాయ్ నువ్వు కాస్తా ప్రశాంతంగా ఉండమని చెప్పా. మిగతాది నేను చూసుకుంటానని ఆయనకు హామీ ఇచ్చా’’ అని ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ వివరాలను వెల్లడించాడు తిలక్.