ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్ అయ్యాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే ప్రజలపై ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ఏర్పాట్లు చేసింది. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను సిటీలోని ఆయా రూట్లలో నడిపిస్తోంది. దీంతో కొంతమేరకు ప్రయాణికులకు ఊరట లభించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన బాటపట్టారు. డ్యూటీలకు వెళ్లకుండా డిపోల ఎదుట బైఠాయించారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. రాష్ట్రప్రభుత్వం నియమించిన ఉద్యోగుల కమిటీతో ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ చర్చలు విఫలం కావడంతో బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కార్మికులంతా సమ్మెకు దిగారు.
అయితే సమ్మె ఎఫెక్ట్ ప్రజలపై పడకుండారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.జేబీఎస్, ఎంజీబీఎస్ వంటి ప్రధాని బస్ స్టేషన్లనుంచి వివిధ జిల్లాలకు ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేట్ బస్సులను నడుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో దాదాపు 10వేల బస్సులున్నాయి. వాటిలో 2వేల700లకు పైగా అద్దె బస్సులు, వెయ్యికి పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. వీటిన్నింటిని నడిపిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేట్ సిబ్బందితో బస్సులను నడిపిస్తున్నారు.

