డిగ్రీలో..అటెండెన్స్, డిస్కషన్లకు క్రెడిట్స్

డిగ్రీలో..అటెండెన్స్, డిస్కషన్లకు క్రెడిట్స్

హైదరాబాద్, వెలుగు: ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త క్రెడిట్ సిస్టమ్ అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. శుక్రవారం కౌన్సిల్​లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన యూనివర్సిటీల వీసీలతో సమావేశం జరిగింది. డిగ్రీలో అసెస్మెంట్ ఎవాల్యుయేషన్ సిస్టమ్​పై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్​బీ) స్టడీ చేసి ఇచ్చిన నివేదికను ఆ సంస్థ తరఫున ప్రొఫెసర్ చంద్రశేఖర్ శ్రీపాద, ప్రొఫెసర్ గరిమమాలిక్ ప్రజెంట్ చేశారు. నివేదికలో చేసిన సిఫార్సులకు వీసీలు ఆమోదం తెలిపారు. 3 గంటల పరీక్ష ద్వారానే స్టూడెంట్ పర్ఫామెన్స్ ను లెక్కగట్టకుండా.. ఇతర యాక్టివిటీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అటెండెన్స్, క్లాస్​ రూమ్ డిస్కషన్స్, ప్రజెంటేషన్స్ తదితర వాటికీ క్రెడిట్స్ ఇవ్వాలని నిర్ణయించామని లింబాద్రి మీడియాకు తెలిపారు.

ఇకపై డిగ్రీ సెకండియర్​లో వాల్యూ అడిషన్ కింద సైబర్ సెక్యూరిటీ కోర్సులు పెడుతున్నామని, దీనికి 4 క్రెడిట్లు పెట్టామన్నారు. దీనికి సిలబస్​ను ఓయూ, జేఎన్టీయూ, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో తయారు చేయించామన్నారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచే నాలుగేండ్ల బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సునూ ప్రవేశపెడతామని తెలిపారు. అనంతరం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ... తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న అన్ని కాలేజీలు, వర్సిటీల్లో చదువుల పండుగను వైభవంగా నిర్వహించాలని సూచించారు. కౌన్సిల్ వైస్ చైర్మన్ వెంకటరమణ, ఓయూ వీసీ రవీందర్, కేయూ వీసీ రమేశ్, ఎంజీయూ వీసీ గోపాల్ రెడ్డి, శాతవాహన వర్సిటీ వీసీ మల్లేశం, టీయూ వీసీ రవీందర్ గుప్తా, తెలంగాణ మహిళా వర్సిటీ ఇన్ చార్జ్​ వీసీ విజ్జులత, కౌన్సిల్ సెక్రటరీ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.