- రూ. 1.13 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి సీజ్
- 30 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు కూడా..
- మొత్తం 8 మంది అరెస్ట్
జీడిమెట్ల/పద్మారావునగర్, వెలుగు:సిటీలో మరోసారి భారీగా డ్రగ్స్, గంజాయితోపాటు నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు కుత్బుల్లాపూర్ఎస్వోటీ టీమ్, జీడిమెట్ల, మేడ్చల్ పోలీసులతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో రూ.63 లక్షల డ్రగ్స్, 30 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ కోటిరెడ్డి శనివారం వెల్లడించారు. ఈ నెల 3న జీడిమెట్ల చింతల్ కమాన్ వద్ద నిర్వహించిన దాడుల్లో 316 గ్రాముల మెథాంఫెటమైన్ డ్రగ్‌ను విక్రయిస్తున్న వేముల సాయికుమార్, కొనుగోలు చేస్తున్న తిరుమల అరవింద్‌ను పక్కా సమాచారంతో అరెస్ట్ చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ. 63 లక్షలు ఉంటుందన్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ డ్రగ్ రాకెట్‌ను నడుపుతున్న ప్రధాన సూత్రధారి పూజిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు.
క్యాబేజీల మాటున పత్తి విత్తనాలు
మరోవైపు మేడ్చల్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా వచ్చిన బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా, క్యాబేజీల మాటున తరలిస్తున్న 30 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని కర్నూలుకు చెందిన ప్రధాన సూత్రధారి సాంబశివరావు ఆదేశాలతో విత్తనాలను సరఫరా చేస్తున్న వాహన డ్రైవర్ నర్సింహ, సరఫరాదారు తలారి రమేశ్నుపోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 15 వేల ఎకరాల సాగుకు సరిపడా ఈ నకిలీ విత్తనాలు ఒకవేళ మార్కెట్లోకి చేరి ఉంటే వెయ్యి మందికి పైగా రైతులు నిలువునా మోసపోయేవారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. గతంలోనూ సూర్యాపేట జిల్లాలో ఇలాంటి నేరాలకు పాల్పడిన ఈ ముఠాపై కేసు నమోదు చేశామని, రైతులు విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
సికింద్రాబాద్‌లో రూ.50 లక్షల గంజాయి
సికింద్రాబాద్‌లో ఎక్సైజ్ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు జరిపిన దాడిలో సుమారు రూ. 50 లక్షల విలువైన 42.9 కిలోల గంజాయి, రూ. 72 వేల నగదు పట్టుబడింది. ఈ కేసులో గణేష్ శివనాథ్, పరమేశ్వర్ దామోదర్, విన్నీ శైలేష్, ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరంతా ఏపీలోని తుని, నర్సీపట్నం ప్రాంతాల నుంచి తక్కువ ధరకే గంజాయిని సేకరించి, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ద్వారా బ్యాగుల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు తరలిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కొనుగోలుదారుల కోసం వేచి చూస్తున్న సమయంలో వీరిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి, శనివారం రిమాండ్‌కు తరలించారు.
