95 చలాన్లు.. 35 వేల ఫైన్: ఏడాదిన్నర ఎస్కేపింగ్ డ్రామాకు ఎల్బీ నగర్‌లో ఎండ్ కార్డ్!

 95 చలాన్లు.. 35 వేల ఫైన్: ఏడాదిన్నర ఎస్కేపింగ్ డ్రామాకు ఎల్బీ నగర్‌లో ఎండ్ కార్డ్!

ఒకటికాదు రెండు దాదాపు 100 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు.. వేలల్లో జరిమానా..ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా ముప్పు తిప్పులు పెడుతున్నాడు. మూడు సార్లు దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. ఏడాదిన్నరగా ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న  వాహనదారుడిని ఎట్టకేలకు ఎల్బీ నగర్ లో పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే. 

ఎల్బీ నగర్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన మారుతి ఎర్టిగా (TS 09GE 7619) కారును ఆపారు. కారు రికార్డులను పరిశీలించిన పోలీసులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. కారుపై అత్యధిక చలాన్లు చూసి నివ్వెర పోయారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రూ. 34వేల 600 విలువల 95 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. 

►ALSO READ | బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఈ కారు యజమాని పోలదాసు సురేష్ గతంలో మూడు సార్లు పోలీసులకు దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తూ చలాన్లను లెక్కచేయకుండా తిరుగుతున్న సురేష్‌ను, ఎస్సై రవికుమార్ బృందం అత్యంత చాకచక్యంగా పట్టుకుంది.

గతంలో మూడు సార్లు  ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు.  పెండింగ్ చలాన్లు మొత్తము చెల్లించి కారుని తీసుకొని వెళ్లవలసిందిగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారుడికి చెప్పారు. అయితే జరిమానా చెల్లించేందుకు కారు ఓనర్ నిరాకరిచండడంతో  కోర్టులో హాజరు పరుస్తామని ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.  చలాన్లు పెండింగ్‌లో ఉన్నా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.