- సిటీ వ్యాప్తంగా ఆరు జోన్లలో జీహెచ్ఎంసీ భారీ డ్రైవ్
- పాతబస్తీలో అధికారుల అడ్డగింత.. టెన్షన్ టెన్షన్
- సికింద్రాబాద్‌లో నిరసన జ్వాలలు.. స్టేషన్ ముట్టడి
హైదరాబాద్ సిటీ/అబిడ్స్/ పద్మారావునగర్/ ఓల్డ్‌సిటీ, వెలుగు:హైకోర్టు ఆదేశాలు, సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు నగరవ్యాప్తంగా ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ముమ్మరం చేశారు. ప్రతి శనివారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ వారం ఆరు జోన్లలో భారీ ఎత్తున చర్యలు చేపట్టారు. పోలీస్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల సమన్వయంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 798 ఆక్రమణలను (340 శాశ్వత, 458 తాత్కాలిక) తొలగించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్వయంగా జాంబాగ్, అత్తాపూర్, గోషామహల్ ప్రాంతాల్లో పర్యవేక్షించారు.
సికింద్రాబాద్‌లో పోలీస్ స్టేషన్ ముట్టడి
సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో జేసీబీలతో రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలు, తోపుడు బండ్లు, దుకాణాల పొడిగింపులను అధికారులు నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దీంతో ఉపాధి కోల్పోయిన వందలాది మంది వీధి వ్యాపారులు ఆగ్రహంతో మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలపడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జాంబాగ్, ఏంజె మార్కెట్, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లో రహదారికి ఇరువైపులా ఉన్న జ్యూస్ సెంటర్లు, చాయ్ బండ్లు, ఇతర చిన్న దుకాణాలను అధికారులు తొలగించారు. అయితే, ముందస్తు సమాచారం లేకుండా తమ పొట్ట కొట్టడంపై చిరు వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ జీవనోపాధిని దెబ్బతీయడం అన్యాయమంటూ ఆందోళనకు దిగారు.
జోన్ల వారీగా తొలగింపు వివరాలిలా..
శంషాబాద్ జోన్ రాళ్లగూడ రోడ్లో అత్యధికంగా 168 శాశ్వత, 54 తాత్కాలిక ఆక్రమణలను తొలగించగా, చార్మినార్ జోన్‌లోని లాడ్ బజార్ నుంచి పురానాపుల్ వరకు 17 శాశ్వత, 35 తాత్కాలిక నిర్మాణాలను, రికాబ్‌గంజ్ రోడ్లో 110 తాత్కాలిక ఆక్రమణలను తొలగించారు. రాజేంద్రనగర్ జోన్లో ఆరాంఘర్ నుంచి పీవీఎన్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నం. 252 వరకు 46 శాశ్వత, 33 తాత్కాలిక ఆక్రమణలను, అత్తాపూర్ పరిధిలో పిల్లర్ నం. 252 నుంచి 116 వరకు 37 శాశ్వత, 59 తాత్కాలిక ఆక్రమణలను క్లియర్ చేశారు. అలాగే గోల్కొండ జోన్‌లోని జాంబాగ్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకు 61 శాశ్వత, 93 తాత్కాలిక ఆక్రమణలను, ఖైరతాబాద్ జోన్‌లోని యూసఫ్‌గూడలో 8 శాశ్వత, 14 తాత్కాలిక ఆక్రమణలను, సికింద్రాబాద్ జోన్ మెట్టుగూడలో 60 తాత్కాలిక ఆక్రమణలను అధికారులు తొలగించారు.
పాతబస్తీలో రాజకీయ అడ్డంకులు.. ఉద్రిక్తత
పాతబస్తీలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫలక్‌నుమా, చార్మినార్ తదితర ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ సిబ్బందిని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్, పత్తర్‌గట్టి కార్పొరేటర్ సయ్యద్ సోయల్ ఖాద్రీ తమ అనుచరులతో కలిసి అధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన చార్మినార్ ఎస్సై, ఇతర సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. మరికొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు అధికారులపై విరుచుకుపడటమే కాకుండా, మున్సిపల్ వాహనాలపై దాడికి యత్నించారు. రాజకీయ నేతల ఆందోళనలతో అక్కడికి తీసుకొచ్చిన జేసీబీ యంత్రాలను వెనక్కి పంపాల్సి రావడంతో కూల్చివేత ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
