అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్ వర్కర్స్ చట్టం ఆమోదం పొందడంపై గిగ్ వర్కర్ల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 5న ఆదివారం సోమాజిగూడలో మంత్రి వివేక్ వెంకటస్వామిని గిగ్ వర్కర్లు, వారి కుటుంబ సభ్యులు, సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. చారిత్రాత్మకమైన ఈ చట్టాన్ని తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ కు , మంత్రికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ గిగ్ & ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ నాయకత్వంలో వచ్చిన ఈ బృందం.. మంత్రిని ఘనంగా సన్మానించింది. ఈ చట్టం వల్ల లక్షలాది మంది డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలకు సామాజిక భద్రత కలుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
►ALSO READ | 95 చలాన్లు.. 35 వేల ఫైన్: ఏడాదిన్నర ఎస్కేపింగ్ డ్రామాకు ఎల్బీ నగర్‌లో ఎండ్ కార్డ్!
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేసి, ప్రతి కార్మికుడికి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
