తెలంగాణ వ్యాప్తంగా దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ వ్యాప్తంగా దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు: డిప్యూటీ సీఎం భట్టి

 తెలంగాణ వ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న దేవాదాయ శాఖ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క  వెల్లడించారు.

వరంగల్‌లో  పర్యటించిన ఆయన.. ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో తీవ్ర నీటి కొరత ఏర్పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని... అనుకోకుండా విద్యుత్ శాఖకు అదనంగా ఏకంగా 7,000 మెగావాట్ల డిమాండ్ పెరిగిందని, ఇది ఒక రకమైన పెద్ద షాక్ లాంటిదని ఆయన అన్నారు.

గత ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా చేసిన హరీష్ రావు వ్యాఖ్యలపై భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ముఖ్యమంత్రి 4 వేల కిలోమీటర్లు నడిచి ఈ కరువును తెచ్చారా? అని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చెబుతున్న ఎల్ నినో పరిస్థితులను చూడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. చదువుకున్న నాయకులు ఇలా బాధ్యతారాహిత్యంగా, దుర్మార్గమైన ఆలోచనలతో మాట్లాడడం బంద్ చేయాలని హితవు పలికారు.

►ALSO READ | తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. అదనపు ధాన్యం కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్

కాంగ్రెస్ హయాంలో గోదావరిపై కట్టిన ప్రాజెక్టులు ఎందుకు కూలలేదు?" అని భట్టి నిలదీశారు. ఇప్పుడు వచ్చి మూడు నెలలు అవకాశం ఇస్తే నీళ్లు నింపుతామని హరీష్ రావు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరి పని వాళ్లు చేయాలని... ఎవరికి వారు పెత్తనం చెలాయిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు లాగే ఘోరమైన పరిణామాలు ఎదురవుతాయని భట్టి విక్రమార్క హెచ్చరించారు.