కొండాపై ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీకి రెడీ :ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య 

కొండాపై ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీకి రెడీ :ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య 
  • సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్‌‌‌‌కు రావాలె
  • ‘తూర్పు’లో పోటీకి నేను సిద్ధం: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య 
  • సురేఖపై తానే హైకమాండ్‌‌‌‌కు ఫిర్యాదు చేశానని వెల్లడి

వరంగల్‍, వెలుగు: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖతో ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీ చేసేందుకు తాను రెడీగా ఉన్నానని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్‌‌‌‌కు రావాలని సవాల్ చేశారు. శుక్రవారం వరంగల్‌‌‌‌లోని తన ఇంట్లో అనుచరులతో సారయ్య సమావేశమై మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డితో పాటు ప్రభుత్వంపై కొండా సురేఖ ఇష్టారీతిన మాట్లాడారని ఆయన ఆరోపించారు.

ఆమెపై చర్యలు తీసుకోవాలని తానే జిల్లాకు చెందిన పలువురు నేతలతో కలిసి పార్టీ హైకమాండ్‌‌‌‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. కొండా దంపతులు వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్నారన్నారు. తాను తూర్పు నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీ చేస్తే తన భార్య కూడా ఓటేయదని సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.  ‘సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్‌‌‌‌కు రావాలి. నేను పోటీకి రెడీగా ఉన్నా’ అని సవాల్ చేశారు.

తాను ఏనాడు రౌడీయిజం చేయలేదని, ఎవరి భూములు గుంజుకోలేదన్నారు. తాను ఇప్పటికీ చిన్న ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నానని చెప్పారు. తూర్పు నియోజకవర్గం ప్రజలు కొండా దంపతులను ఛీ కొడితే పరకాలకు, అక్కడి ప్రజలు ఛీ కొడితే మళ్లీ వరంగల్ తూర్పుకు వచ్చారని ఎద్దేవా చేశారు. ‘నేను చస్తే ఇదే తూర్పు నియోజకవర్గంలోని ఆటోనగర్ శ్మశానవాటికకు తీసుకెళ్తరు. కొండా దంపతులను వాళ్ల సొంతూరు గీసుగొండ మండలం వంచనగిరికి తీసుకెళ్తరు కదా. ఎవరు లోకల్ అనేది జనాలే చెప్పాలి’ అని సారయ్య అన్నారు.

కాగా, గుండు సుధారాణికి కుడా చైర్‌‌‌‌పర్సన్ పదవి ఇవ్వడంపై మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసినవాళ్లు బాధపడుతున్నారని చెప్పారు. అయితే హైకమాండ్ తీసుకునే నిర్ణయాలను తాను గౌరవిస్తానని సారయ్య స్పష్టం చేశారు.