హైదరాబాద్ జనానికి బిగ్ అలర్ట్.. హెల్త్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. ఏపీలో క్రమంగా కరోనా కేసులు పెరగటమే కాకుండా మరణాలు నమోదు అవుతున్న క్రమంలో.. హైదరాబాదీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.
ఏపీ నుంచి హైదరాబాద్ సిటీకి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. బస్సులు, రైళ్లల్లో, విమానాల్లో వచ్చి పోతూ ఉంటారు. ఏపీ నుంచి రోజూ వెయ్యి బస్సుల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందులో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులతో పాటు రైళ్ల ద్వారా ఏపీ నుంచి హైదరాబాద్ సిటీకి నిత్యం 10 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాదీలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లతో పాటు నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకంటే కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకే వైరస్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. సాధారణ జలుబు లేదా ఫ్లూలా కాకుండా కోవిడ్ నిర్ధారణలో ఆలస్యమైతే అవయవాలపై ప్రభావం చూపి శరీరాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. కరోనా లక్షణాలు ఉంటే మాస్క్ ధరించడంతో పాటు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి మళ్లీ చాపకిందనీరులా విస్తరిస్తోన్న నేపథ్యంలో గర్భిణీ స్త్రీలు, మూత్రపిండాలు/గుండె జబ్బులు వంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఏపీలో కొత్తగా 7 కరోనా కేసులు
ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. కొత్తగా 7 కరోనా కేసులు నమోదు కావడంతో తోటి తెలుగు రాష్ట్రంలో ప్రజలు కలవరపాటుకు లోనవుతున్నారు. గుంటూరులో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. బాపట్లలో ఒక కరోనా కేసు నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలిపి.. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26కి చేరింది.
ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటివరకూ నలుగురు చనిపోయారు. చనిపోయిన నలుగురు కాకినాడ, గుంటూరు జిల్లాలకు చెందిన వారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేవలం 20 రోజుల్లోనే 12 కేసులు నమోదు కావడంతో పాటు నలుగురు మరణించడంతో ఏపీలో కరోనా భయం పట్టుకుంది.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం భారత్లో తక్కువగానే ఉందని, భయపడాల్సిన పని లేదని వైద్య శాఖ అధికారులు తెలిపారు. కానీ, శ్వాసకోశ సంబంధ వ్యాధిగ్రస్తులతో పాటు వయోవృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, బయటకు వెళ్లినపుడు మాస్కులు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలతో కరోనాతో వ్యాప్తి తగ్గుతుందని సలహా ఇస్తున్నారు.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితో పాటు వృద్ధులు, శ్వాస సంబంధ సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ పరిధుల్లో జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం. నేటి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం లేదని, తీవ్ర అనారోగ్యాలకు కారణం కావడం లేదని, అతిగా భయపడవలసిన పని లేదని నిపుణులు సూచిస్తున్నారు.
