ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బారామతి ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఈ మేరకు ఆకాశ్ విశ్వనాథ్ మోర్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ఆదివారం (ఏప్రిల్ 5) కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ పోటీకి సై అనడంతో బారామతి ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏప్రిల్ 23న జరగనున్న ఈ ఉప ఎన్నికలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ అధినేత్రి సునేత్ర పవార్‌తో విశ్వనాథ్ మోర్ తలపడనున్నారు.
2026, జనవరి 28న మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో దివంగత నేత అజిత్ పవార్ మరణించిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ అకాల మరణంతో బారామతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్సీపీకి కంచుకోటైన బారామతి నుంచి అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలోకి దిగారు. అజిత్ పవార్ గౌరవార్థం బారామతి ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని వివిధ పార్టీలను సునేత్ర పవార్ కోరారు.
►ALSO READ | ఈసారి సరిహద్దుల్లో కాదు.. నేరుగా కోల్‌కతాపైనే అటాక్ చేస్తం: పాక్ మంత్రి బీరాలు
ఇందులో భాగంగానే ఆదివారం (ఏప్రిల్ 5) ఉదయం మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్‌కు సునేత్ర పవార్ ఫోన్ చేసి బారామతి ఏకగ్రీవ ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించాలని కోరారు. అజిత్ పవార్ గౌరవ సూచకంగా బారామతి ఉప ఎన్నికలో పోటీ చేయబోమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) ఇప్పటికే ప్రకటించింది. బారామతి ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మద్దతు కూడా కోరారు సునేత్ర పవార్.
ఆమె అభ్యర్థనపై శివసేన తమ వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదు. ఇంతలోనే సునేత్ర పవార్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ బారామతి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో బారామతి ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సునేత్ర పవార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏప్రిల్ 23న జరగనున్న ఈ ఉప ఎన్నికలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ అధినేత్రి సునేత్ర పవార్‌తో విశ్వనాథ్ మోర్ తలపడనున్నారు.
