రాజ్యసభలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్లమెంటరీ నేతగా వద్దిరాజు

రాజ్యసభలో  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్లమెంటరీ నేతగా వద్దిరాజు

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సీనియర్‌‌‌‌ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను పార్టీ పార్లమెంటరీ నేతగా కేసీఆర్‌‌‌‌ నియమించారు. ఇప్పటివరకు ఆయన పార్టీ ఉప నేతగా ఉన్నారు. గతంలో ఈ పదవిలో ఉన్న కేఆర్‌‌‌‌ సురేశ్‌‌‌‌ రెడ్డి పదవీకాలం ముగియడంతో ఎంపీ రవిచంద్రకు అవకాశం ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్‌‌‌‌ బండ ప్రకాశ్‌‌‌‌ శాసనమండలికి వెళ్లడంతో ఆయన స్థానంలో రవిచంద్రను ఎంపిక చేశారు. వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం 2030 ఏప్రిల్‌‌‌‌ వరకు కొనసాగనుంది. 

ఆయన ప్రస్తుతం పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం, బొగ్గు గనుల శాఖ సంప్రదింపుల కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంటరీ నేతగా నియమించినందుకు కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఎర్రవల్లి ఫాంహౌస్‌‌‌‌లో కేసీఆర్‌‌‌‌ను కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌‌‌‌కు పంపే లేఖను కేసీఆర్‌‌‌‌ ఆయనకు అందించారు. బీసీ వర్గానికి చెందిన తనకు రెండుసార్లు రాజ్యసభ అవకాశం ఇవ్వడం, ఇప్పుడు పార్లమెంటరీ నేత బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని రవిచంద్ర అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను పార్లమెంటులో గట్టిగా వినిపిస్తానని చెప్పారు. ప్రస్తుతం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి రాజ్యసభలో వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, దీవకొండ దామోదర్‌‌‌‌రావు సభ్యులుగా ఉన్నారు.