- నేను లేని టైంలో తీసుకున్న నిర్ణయాలపై పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేశా :
భువనగిరి ఎంపీ చామల
సూర్యాపేట, వెలుగు : 'తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు, నాకు ఎలాంటి విభేదాలు లేవు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు' అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని, వర్గ పోరుతో రోడ్డు ఎక్కొద్దని సూచించారు.
సామాన్య కార్యకర్తలుగా ఉన్న తనను, ఎమ్మెల్యే సామేల్ ను పార్టీ శ్రేణులు అక్కున చేర్చుకుని గెలిపించారని, అలాంటి కార్యకర్తల మధ్య మనస్పర్ధలు రావడం బాధాకరమన్నారు. మండల స్థాయి, పీఏసీఎస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల విషయంలో తాను ఎవరినీ ప్రమోట్ చేయలేదని, కార్యకర్తలు ఎవరిని కోరుకుంటే వారికే పదవులు ఇవ్వాలని సామేల్‌కు చెప్పానని స్పష్టం చేశారు.
తాను ఇండియాలో లేని సమయంలో తీసుకున్న నిర్ణయాలపై కార్యకర్తలు ఫోన్ చేశారని, ఈ విషయాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ దృష్టికి తీసుకెళ్లానని, ఆ ప్రకటనను నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు. ఎ
మ్మెల్యే సామేల్ తీసుకునే సరైన నిర్ణయాలకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత మండలమైన తిరుమలగిరి, తన సొంత మండలమైన శాలిగౌరారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయని, అందుకే ఈ నియోజకవర్గంపై తమకు ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. త్వరలోనే సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్‌తో కలిసి చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. నమ్ముకున్న కేడర్ ను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
