హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సును అడ్డగించి, డ్రైవర్‌పై దాడికి తెగబడటమే కాకుండా.. బస్సు అద్దాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు.
ఏప్రిల్ 5న తెల్లవారుజామున పటాన్ చెరువు నుంచి కోఠికి బయలుదేరిన బర్కత్ పుర డిపో బస్సును.. మాదాపూర్ గూగుల్ ఆఫీస్ సమీపంలో కొందరు యువకులు అడ్డగించారు. TS 07 FZ 7272 నంబర్ గల ఆడి కార్ లో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు, ఒక యువతి.. మద్యం మత్తులో బస్సును ఓవర్ టేక్ చేసి అడ్డంగా ఆపారు.
కారు దిగిన యువకులు డ్రైవర్ మొయినుద్దీన్‌తో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై ఉన్న రాళ్లతో బస్సు అద్దాలను పగలగొట్టారు. ఈ క్రమంలో యువకులు విసిరిన రాయి.. అటుగా వెళ్తున్న ఓ బైకర్ తలకు బలంగా తగలడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటన అనంతరం నిందితులు తమ కారులో అక్కడి నుంచి పరారయ్యారు. డ్రైవర్ మొయినుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
