హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా సేవలను రాష్ట్రమంతా విస్తరించాలని కోరుతూ శనివారం హైదరాబాద్‌లో హైడ్రా మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌టీఆర్ గార్డెన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సచివాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, పార్కులు వంటి ఆస్తులను ఆక్రమణల నుంచి రక్షించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల కోసం హైడ్రా కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఔలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
