- ఐక్యంగా ఉంటేనే ఎన్డీయేను ఎదిరించగలం..
- ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలకు రాహుల్‌గాంధీ పిలుపు
- ఒకరినొకరు బలహీనపర్చుకునే చర్యలు వద్దని సూచన
న్యూఢిల్లీ: ‘‘కలిసి ఉంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం’’ అంటూ ఇండియా కూటమి పార్టీలకు కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సందేశమిచ్చారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా పనిచేయాల్సిందేనని అన్నారు. కూటమి పార్టీలు ఒకరినొకరు విమర్శించుకోవడం, బలహీనపరచుకోవడం మానుకోవాలని హితవు పలికారు.
దేశం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు అందరమూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడిన రాహుల్ గాంధీ, ‘ఓట్ల దోపిడీ’ వంటి అంశాల్లో కొన్ని మిత్రపక్షాల నుంచి తగిన మద్దతు లభించలేదనే అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే, కూటమిలో భాగంగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీని తరచూ విమర్శించే పార్టీల తీరుపైనా ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ, ఓటరు జాబితాల తారుమారుపై ఉన్న అనుమానాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని ఇండియా కూటమి ఏకాభిప్రాయానికి వచ్చింది. వీలైనంత త్వరగా ఆ లేఖను సమర్పించాలని నిర్ణయించింది.
బీజేపీని ఓడించడం కష్టమేం కాదు
బీజేపీని ఓడించడం అంత కష్టమైన విషయం కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకే పరిమితమైందని, 2019లో సాధించిన 303 సీట్లతో పోలిస్తే ఇది గణనీయంగా తగ్గిందని గుర్తుచేశారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు గెలుచుకుని తన బలాన్ని పెంచుకుందని చెప్పారు. ఇటీవల లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్షాలు కలిసి వ్యతిరేకించడం ఐక్యతకు నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
2026 ఏప్రిల్ 17న ప్రతిపక్షాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లులను ఓడించాయని, అదే ఐక్యతను మరింత బలోపేతం చేసి దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఈ సమావేశంలో అస్సాం, బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, కేరళలో కాంగ్రెస్ విజయం సాధించడం, తమిళనాడులో నటుడు విజయ్ ప్రధాన విజేతగా నిలవడం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
