- షిప్పింగ్కు భద్రత పునరుద్ధరించాలని ప్రపోజల్
- పాక్ ద్వారా సమాధానం పంపినట్టు ఇరాన్ మీడియా వెల్లడి
- ఇరాన్ రిప్లైపై ఇంకా స్పందించని అమెరికా
టెహ్రాన్: అమెరికా పంపిన తాజా కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరాన్ తన ప్రతిస్పందనను మధ్యవర్తి పాకిస్తాన్ ద్వారా పంపిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం తెలిపింది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడంపైనే చర్చలు దృష్టి సారించాలని కోరినట్టు వెల్లడించింది.
లెబనాన్ లో హెజ్బొల్లా మిలిటెంట్లతో ఇజ్రాయెల్ పోరాటం కూడా ఆపాలని, యుద్ధాన్ని లెబనాన్ సహా అన్ని రంగాలలో యుద్ధాన్ని ముగించాలని, నౌకల భద్రతను పునరుద్ధరించాలని ఇరాన్ కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఇరాన్ నుంచి రిప్లైని అందుకున్నట్లు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. అయితే, యుద్ధాన్ని ముగించడం, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవడం వంటి అంశాలతో కూడిన ఒప్పందాన్ని అమెరికా తాజాగా ప్రతిపాదించింది.
కానీ, ముందుగా యుద్ధం ముగింపుపై చర్చించాలని, ఆ తర్వాతే అణు అంశంపై చర్చించాలని ఇరాన్ పట్టుబడుతోంది. తాజాగా ఇరాన్ పంపిన సమాధానంపై అమెరికా ఇంకా స్పందించలేదు. మళ్లీ దాడులకు దిగడానికి ముందే దౌత్యానికి సాధ్యమైనన్ని అవకాశాలను ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నారని యూఎన్‌లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ ఏబీసీతో చెప్పారు. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఉమ్మడి సైనిక కమాండ్ అధిపతులతో సమావేశమయ్యారని.. శత్రువులను సమర్థంగా ఎదుర్కోవడానికి, యుద్ధం కొనసాగించడానికి నిర్ణయాత్మక ఆదేశాలు జారీ చేశారని ఇరాన్ మీడియా పేర్కొంది.
ఖతార్ తీరంలో కార్గో షిప్‌పై డ్రోన్ దాడి
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నా.. పర్షియన్ గల్ఫ్ లో నౌకలపై డ్రోన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఖతార్ తీరంలో ఆదివారం తెల్లవారుజామున ఒక సరకు రవాణా నౌకపై డ్రోన్ దాడితో మంటలు చెలరేగాయి. అబుదాబి నుంచి వస్తున్న కార్గో షిప్‌పై ఈ దాడి జరిగిందని, మంటలను తమ సిబ్బంది ఆర్పివేశారని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. తమ గగనతలంలోకి కూడా డ్రోన్లు ప్రవేశించాయని కువైట్ అధికారులు తెలిపారు. ఈ రెండు దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్, కువైట్ పేర్కొన్నాయి.
కాగా, గత వారం రోజులుగా పర్షియన్ గల్ఫ్‌లో నౌకలపై దాడులు జరిగాయి. ఇరాన్ ఓడరేవులపై తమ దిగ్బంధాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తున్నాయని చెబుతూ శుక్రవారం అమెరికా రెండు ఇరాన్ చమురు ట్యాంకర్లపై దాడి చేసింది. కాగా, తాము రెండు డ్రోన్లను కూల్చివేశామని యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఆ డ్రోన్లు ఇరాన్ నుంచే వచ్చాయని ఆరోపించింది.
