అస్సాంలోని గౌహతి నగరంలో ఉన్న కామాఖ్య ఆలయంలో ప్రతి ఏడాది వర్షాకాలంలో జరిగే ఒక పవిత్రమైన హిందూ పండుగే "అంబుబాచి మేళా". దీనిని 'తూర్పు మహాకుంభం' అని కూడా పిలుస్తారు. కామాఖ్య దేవి వార్షిక ఋతుచక్రాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.....
ఈ వార్షిక జాతరను చూడటానికి దేశ విదేశాల నుండి లక్షల మంది భక్తులు, సాధువులు, పర్యాటకులు వస్తారు. హిందూ సంప్రదాయంలో సృష్టికి, స్త్రీ శక్తికి ప్రతీక అయిన కామాఖ్య దేవిని దర్శించుకోవడానికి జూన్ నెలలో జరిగే ఈ పండుగ అత్యంత ముఖ్యమైనది.
అంబుబాచి మేళా ఎప్పుడు జరుగుతుందంటే
ఈ ఉత్సవం సాధారణంగా ప్రతి ఏడాది జూన్ నెలలో నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కామాఖ్య దేవి ఋతుచక్ర సమయంలో ఉంటుందని నమ్మడం వల్ల ఈ నాలుగు రోజుల్లో మొదటి మూడు రోజులు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో గుడి లోపల ఎలాంటి పూజలు, మతపరమైన కార్యక్రమాలు జరగవు. నాలుగో రోజున ప్రత్యేక పూజలు, శుద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాతే భక్తుల దర్శనానికి తలుపులు తెరుస్తారు.
ఆలయ పూజారుల ప్రకారం, 2026 సంవత్సరానికి గాను ఈ ఉత్సవాలు అస్సామీ క్యాలెండర్ ప్రకారం జూన్ 22వ తేదీ రాత్రి ప్రారంభమై, జూన్ 26వ తేదీ సూర్యోదయంతో ముగుస్తాయి.
ALSO READ : తెలంగాణలో 33 జిల్లాల్లోని టూరిజం ప్రాంతాలు ఇవే..
అస్సామీ మాసం 'ఆహార్': ఆహార్ అనేది అస్సామీ క్యాలెండర్ లోని మూడవ నెల. ఇది మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జూన్, జూలై నెలల మధ్య వస్తుంది. అస్సాంలో వర్షాలు పడి, వ్యవసాయ పనులు ప్రారంభం కావడానికి ఈ నెల చాలా ముఖ్యమైనది.
అంబుబాచి మేళాకు ఉన్న ప్రాముఖ్యత
తంత్ర సాధన చేసేవారికి, సన్యాసులకు అంబుబాచి మేళా చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో భారతదేశం నలుమూలల నుండి రకరకాల సాధువులు, అఘోరాలు ఇక్కడికి వస్తారు. ఈ జాతర అస్సాం సంస్కృతిని, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతుంది. గౌహతిలోని నీలాచల్ కొండలపై ఉన్న కామాఖ్య ఆలయం, భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పండుగ ముగిసిన తర్వాత భక్తులకు 'అంగబస్త్రం' అనే ఎర్రటి వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇది అమ్మవారి ఆశీస్సులతో సమానమని భక్తుల నమ్మకం.
ఆలయాన్ని ఎందుకు మూసివేస్తారు?
సాధారణంగా మహిళలు ఋతుస్రావం సమయంలో దూరంగా ఉన్నట్లే, కామాఖ్య దేవి కూడా ఆ మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటుందని నమ్ముతారు. అందుకే ఈ మూడు రోజులు గుడి తలుపులు తెరవరు. ఈ సమయంలో భక్తులు కూడా కొన్ని కఠినమైన నియమాలను పాటిస్తారు. ఇళ్లలో వంట, పూజలు చేయకపోవడం, పవిత్ర గ్రంథాలు చదవకపోవడం, భూమిని తవ్వడం లేదా వ్యవసాయ పనులు చేయకపోవడం వంటివి చేస్తారు. ఈ మూడు రోజులు పూర్తయిన తర్వాత, నాలుగో రోజున కామాఖ్య దేవికి పవిత్ర స్నానం చేయించి, ప్రత్యేక ఆచారాల ప్రకారం పూజలు చేసిన తర్వాతే భక్తులను గుడిలోకి అనుమతిస్తారు.
