నాలుగు రోజులు నిప్పుల గుండమే..ఈ జిల్లాల వాళ్లు బయటకొస్తే జాగ్రత్త

నాలుగు రోజులు నిప్పుల గుండమే..ఈ జిల్లాల వాళ్లు బయటకొస్తే జాగ్రత్త

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రానున్న నాలుగైదు రోజులు రాష్ట్రంలో భానుడు భగ్గుమనే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నిప్పుల కొలిమిని తలపిస్తూ ఎండల తీవ్రత మరింత పెరగనుండటంతో.. మధ్యాహ్నం సమయంలో జనం ఎవరూ బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. పలు జిల్లాలకు కలర్ అలర్ట్‌లు జారీ అయ్యాయి.

ముఖ్యంగా మే 18న  అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

మరోవైపు రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్న ద్రోణి, చక్రవాత ఆవర్తనం కారణంగా మే 18,  19, 20 తేదీల్లో   అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

కానీ  రేపటి నుంచి  వరుసగా రెండు రోజుల పాటు ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పాటు.. తీవ్రమైన వడగాడ్పులు వీచే ప్రమాదం ఉండటంతో వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది.

ముఖ్యంగా మే 19న  అదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల కంటే పైగా నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు రేపు మరో 24 జిల్లాలకు ఎండల తీవ్రత దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.