పేరు మారింది తప్ప బతుకులు మారలే

పేరు మారింది తప్ప బతుకులు మారలే
  • రెగ్యులరైజ్ చేశామంటున్న సర్కార్.. పూర్తి కాలేదంటున్న ఆర్టిజన్లు
  • విద్యుత్ సంస్థల్లో 23 వేల మంది ఆర్టిజన్ల గోస
  • స్టాండింగ్ రూల్స్ పేరుతో విద్యుత్ సంస్థల చెలగాటం
  • ఏపీఎస్ఈబీ రూల్స్అమలు చేయాలని ఆర్టిజన్ డిమాండ్

హైదరాబాద్‌, వెలుగు:  విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్ కార్మికులు రెగ్యులరైజ్ అయ్యారా? లేదా? రెగ్యులరైజ్ చేశామని సర్కార్ చెప్తుండగా.. అది పూర్తిస్థాయిలో అమలు కావట్లేదని ఆర్టిజన్లు అంటున్నారు. కాంట్రాక్ట్‌ కార్మికుల నుంచి ఆర్టిజన్లుగా తమ పేరు మారింది తప్ప.. బతుకులు మాత్రం మారలేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. హైకోర్టు చెప్పినా తమకు సర్వీస్ రూల్స్ కూడా అమలు చేయట్లేదని చెప్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ రూల్స్ ను తెచ్చిన విద్యుత్ సంస్థలు వాటిని తమపై మోపి రెగ్యులరైజ్ చేసినట్టు చెప్పుకుంటున్నాయని  మండిపడుతున్నారు. జాగా తమ హక్కుల కోసం ఆందోళన చేపట్టిన ఆర్టిజన్ ల సంఘం నేతను సస్పెండ్ చేయడం.. బుచ్చిరాజు అనే ఆర్టిజన్ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంతో రెగ్యులరైజేషన్ వివాదం సంచలనంగా మారింది.

రెగ్యులరైజేషన్ పూర్తి చేయలే

ఆర్టిజన్‌‌ కార్మికులకు గతంలో ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి విద్యుత్‌‌ సంస్థలు నేరుగా జీతాలు మాత్రమే ఇస్తున్నాయి. హైకోర్టు గైడై లైన్స్ ప్రకారం సర్వీసు నిబంధనలు అమలు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు చేయలేదు. మధ్యవర్తి లేకుండా విద్యుత్‌‌ సంస్థలు జీతాలు ఇస్తున్నా ప్రభుత్వం తీసుకున్న విలీన నిర్ణయాన్ని అమలు చేయడం లేదని సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యుత్‌‌ సంస్థలు ఆర్టిజన్‌‌లను సంస్థలో విలీనం చేసుకోవచ్చని 2018 సెప్టెంబరు18న హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 2020 ఆగస్టు 7న స్టాండింగ్‌‌ రూల్స్‌‌ తీసుకువచ్చి అమలు చేస్తున్నారు. దీన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఓవైపు అసెంబ్లీలో, మరోవైపు ఇటీవల పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌‌, మంత్రులు విద్యుత్‌‌ సంస్థల్లో పని చేస్తున్న 23 వేల మందిని రెగ్యులరైజ్‌‌ చేసినట్లు ప్రకటించారు. రెగ్యులరైజేషన్‌‌ పూర్తికాకపోయినా చేసినట్లు చెప్పుకోవడంపై విద్యుత్‌‌ కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. విద్యుత్‌‌ సంస్థల యాజమాన్యాలు సంఘాల మధ్య చీలిక తెచ్చి ఆర్టిజన్‌‌లను రెగ్యులరైజ్‌‌ చేసినట్లు మోసం చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

ఏపీఎస్‌‌ఈబీ రూల్స్‌‌ వర్తింపచేయాలె

సర్కారు ఇచ్చిన రెగ్యులరైజ్‌‌ హామీని ఇప్పటికీ విద్యుత్‌‌ సంస్థలు అమలు చేయడం లేదని విద్యుత్ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఇటీవల హైదరాబాద్‌‌ మింట్‌‌ కాంపౌండ్‌‌లో, వరంగల్‌‌లోని ఎన్‌‌పీడీసీఎల్‌‌ వద్ద విద్యుత్‌‌ ఉద్యోగుల సంఘాలు ఆందోళన చేశాయి. మార్చి 8న చలో విద్యుత్‌‌ సౌధ కార్యక్రమానికి సిద్ధమయ్యాయి. దీంతో  ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న విద్యుత్‌‌ కాంట్రాక్టు వర్కర్స్‌‌ యూనియన్‌‌ అధ్యక్షుడు గాంబో నాగరాజుపై శనివారం రాత్రి టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ యాజమాన్యం సస్పెన్షన్‌‌ వేటు వేసింది. విద్యుత్ సంస్థల తీరుతో ఆవేదన చెందిన జగిత్యాల జిల్లా పొలాసకు చెందిన ఆర్టిజన్‌‌ కార్మికుడు అంకం బుచ్చిరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆర్టిజన్‌‌ ల రెగ్యులరైజ్‌‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారు

తెలంగాణ ఉద్యమంలో విద్యుత్‌‌ కార్మికులను ఏకం చేసి ఉద్యమిస్తే రాష్ట్రం వచ్చాక రెగ్యులరైజ్‌‌ చేయకపోగా ప్రశ్నిస్తే సస్పెండ్‌‌ చేశారు. సీఎం చెప్పే దానికి, విద్యుత్‌‌ సంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానానికి పొంతన లేదు. ఆర్టిజన్ లను రెగ్యులరైజ్‌‌ చేయకుండా కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. 70 ఏండ్లు దాటిన వాళ్లను కూడా సీఎండీలుగా, డైరెక్టర్లుగా కొనసాగిస్తూ గ్రౌండ్లెవల్లో పని చేస్తున్న సిబ్బందిని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆఫీసులకే పరిమితమై క్షేత్రస్థాయికి వెళ్లలేని ఈ వృద్ధుల వల్లే విద్యుత్‌‌ సంస్థలు నష్టపోతున్నాయి. -గాంబో నాగరాజు, ప్రెసిడెంట్, విద్యుత్‌‌ కాంట్రాక్ట్‌‌ వర్కర్స్‌‌ యూనియన్‌‌

ఉద్యోగుల డిమాండ్లు ఇవే

  • విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ లను పూర్తిస్థాయిలో రెగ్యులరైజ్‌‌ చేసి, ఎపీఎస్‌‌ఈబీ రూల్స్ వర్తింపజేయాలి.
  • రెగ్యులర్ ఉద్యోగులకు కల్పిస్తున్న అన్ని సదుపాయాలు కల్పించాలి.
  • ఆర్టిజన్‌‌లతో పాటు మిగిలిన 6,500 మంది ఎస్‌‌పీఎం, పీఏఏ, పీసీఏ(ఆర్‌‌సీ), మీటర్ రీడర్లు, స్టోర్ హమాలీలు, ఏపీటీఎస్‌‌ విజిలెన్స్, సెక్యూరిటీ గార్డులకు ఈపీఎఫ్‌‌, ఈఎస్‌‌ సౌకర్యంతో కూడిన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి. జీవో నంబరు 11 ద్వారా శాలరీలు ఇవ్వాలి.

అమలు చేస్తున్న స్టాండింగ్ రూల్స్ ఇవీ..

  • స్వాతంత్య్రం రాక ముందు ఉన్న1946 నాటి బ్రిటీష్ చట్టమే ఇప్పటికీ అమలవుతోంది.  
  • ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం కార్మికులకు సంస్థపై ఎలాంటి హక్కులు ఉండవు.
  • ఆర్టిజన్‌‌ను ఈ చట్టం ద్వారా ఈజీగా టర్మినేట్ చేయొచ్చు.
  • ఆర్టిజన్‌‌లకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇష్టం వచ్చినప్పుడు తీసేయెచ్చు.
  • సెలవులు, మెడికల్‌‌ లీవ్స్‌‌, మెడికల్‌‌ బెనిఫిట్స్‌‌ ఉండవు.
  • మెడికల్‌‌ ఇన్సూరెన్స్‌‌ కోసం శాలరీ నుంచే రూ.500 కట్‌‌ చేసి మెడికల్‌‌ ఇన్సూరెన్స్‌‌ కల్పిస్తున్నారు.