- గోడౌన్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తం: తుమ్మల
- ప్రభుత్వ ఆర్డర్లన్నీ టెస్కోకే ఇస్తామన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు : ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, దీనికోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వ్యవసాయ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్లో అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. నిరుపయోగంగా ఉన్న ఫుడ్ పార్కులలోని ఖాళీ స్థలాలను గుర్తించి, మౌలిక సదుపాయాలు కల్పించి, ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు.
పెట్టుబడిదారులకు ప్రోత్సాహన్ని ఇచ్చి ఫుడ్ పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో రైతులు నష్టపోకుండా, అగ్రి, హార్టీ కల్చర్ పంటల ఉత్పత్తులకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, బయో మన్యుర్, బయోమాస్ యూనిట్లను ప్రోత్సహించాలన్నారు. రైస్ మిల్లింగ్ పాలసీలో భాగంగా కొత్త రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కొహెడ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి ప్రణాళికలు రెడీ చేయాలని సూచించారు.
టెస్కోకు భారీగా ఆర్డర్లు ఇస్తం
జీవో నం. 1, ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారా వస్త్రాలను కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి దాదాపు రూ.255 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థల నుంచి ఎలాంటి ఆర్డర్లున్నా టెస్కో ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. టెస్కో ద్వారా‘శానిటరీ నాప్కిన్’ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. బుగ్గపాడు మెగా టెక్స్ టైల్ పార్కులో వచ్చెనెలలో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. పవర్ లూమ్స్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
కేంద్రం ఇచ్చే సబ్సిడీని తీసుకుందాం
రాష్ట్రంలో మార్కెటింగ్, వేర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ (గిడ్డంగుల సంస్థ) గోడౌన్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తుందని, ఈ సబ్సిడీని కూడా పొందే అవకాశాలను పరిశీలించాలన్నారు.
