
హైదరాబాద్, వెలుగు : రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాత్రింబవళ్లు వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘వడ్ల కుప్పల దగ్గర పిడుగుపాటుకు గురై రైతులు చనిపోతున్నరు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట 45 రోజులుగా కల్లాల్లోనే ఉంది. ఎప్పుడు కొనుగోలు చేస్తారో అని రైతులు వేచి చూస్తున్నరు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. తాలు, తేమ పేరుతో 40 కిలోల బస్తాకు 4 కిలోల చొప్పున తరుగు తీస్తున్నరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నది.
కాంటా చేసిన వడ్లకు రసీదు ఇవ్వడం లేదు. రైస్ మిల్లులకు పోయిన ధాన్యంలో కూడా 3 కిలోల చొప్పున తరుగు తీస్తున్నరు’’అని అన్నారు. రాష్ట్రంలో ఈ దందా నడిపిస్తున్నదెవరో తేల్చాలన్నారు. రైతులు తమ సమస్యలు మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పరిష్కరించలేదని మండిపడ్డారు. మొన్నటి దాకా క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు సన్న రకానికి మాత్రమే ఇస్తామంటూ మాట మార్చిందన్నారు. ఇప్పటి దాకా రైతు బంధు, రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు.