సౌతాఫ్రికాతో ముగిసిన చివరిదైన ఐదో టీ20లో టీమిండియా విజయం సాధించింది. శుక్రవారం (డిసెంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో సఫారీలపై గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా 3-1 తేడాతో గెలుచుకుంది. బ్యాటింగ్ లో తిలక్ వర్మ (42 బంతుల్లో 73: 10 ఫోర్లు, సిక్సర్),హార్దిక్ పాండ్య (25 బంతుల్లో 63: 5 ఫోర్లు, 5 సిక్సులు)తో పాటు బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి (4/53) తన స్పిన్ మ్యాజిక్ ను చూపించి విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఛేజింగ్ లో సౌతాఫ్రికా 201 పరుగులకు పరిమితమైంది.
232 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకు ఓపెనర్లు మెరుపు ఆరంభం ఇచ్చారు. క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్ ;తొలి వికెట్ కు 6.3 ఓవర్లలోనే 69 పరుగులు జోడించారు. వీరి భాగస్వామ్యంలో షో మొత్తం డికాక్ దే. తొలి ఓవర్ లో అర్షదీప్ బౌలింగ్ లో మూడు బౌండరీలు కొట్టిన ఈ సఫారీ ఓపెనర్.. మూడో ఓవర్ లో అర్షీదీప్ ను మరోసారి టార్గెట్ చేస్తూ ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. ఒక ఎండ్ లో డికాక్ రెచ్చిపోయి ఆడితే మరో ఎండ్ లో హెన్డ్రిక్స్ అలా చూస్తూ ఉండిపోయాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఏడో ఓవర్లో వరుణ్ చక్రవర్తి విడగొట్టాడు. రీజా హెండ్రిక్స్ (13) ను ఔట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన బ్రేవీస్.. ఓపెనర్ డికాక్ తో కలిసి రెచ్చిపోయాడు. బౌండరీలతో హోరెత్తిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సౌతాఫ్రికా 9 ఓవర్లో 23 పరుగులు.. 10 ఓవర్లో 19 పరుగులు రాబట్టడంతో తొలి 10 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 118 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్లింది. టీమిండియాకు చెమటలు పట్టించిన ఈ జోడీని బుమ్రా విడగొట్టాడు. ఒక అద్భుతమైన రిటర్న్ క్యాచ్ తో బుమ్రా.. డికాక్ (65)ను పెవిలియన్ కు చేర్చాడు. కాసేపటికే పాండ్య.. బ్రేవీస్ (31) ను ఔట్ చేయడంతో టీమిండియాకు బిగ్ రిలీఫ్ లభించింది.
ఇన్నింగ్స్ 13 ఓవర్లో వరుణ్ చక్రవర్తి మరోసారి మ్యాజిక్ చేశాడు. వరుస బంతుల్లోనే మార్కరం (6), ఫెరీరా (0) లను ఔట్ చేసి సౌతాఫ్రికాను కష్టాల్లో పడేశాడు. మిల్లర్ 918) కూడా ఔట్ కావడంతో సఫారీ ఓటమి ఖాయమైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి పడగొట్టాడు. అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యలకు తలో వికెట్ తీసుకున్నారు.
పాండ్య, తిలక్ మెరుపులతో టీమిండియా భారీ స్కోర్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు ఓపెనర్లు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. శాంసన్, అభిషేక్ శర్మ పవర్ ప్లే ను ఉపయోగించుకుంటూ బౌండరీల మోత మోగించారు. తొలి వికెట్ కు 63 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ (34) ఔటయ్యాడు. ఓపెనర్ల విజృంభణతో ఇండియా పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఈ దశలో శాంసన్ తో కలిసి తిలక్ వర్మ జట్టును ముందుకు తీసుకెళ్లారు. 37 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించిన శాంసన్ ను ఒక అద్భుత డెలివరీతో లిండే బౌల్డ్ చేశాడు.
తిలక్ వర్మకు జత కలిసిన హార్దిక్ పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి బంతికే సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్ ఆరంభించిన పాండ్య తన దూకుడును ఇన్నింగ్స్ మొత్తం చూపించాడు. మరో ఎండ్ లో తిలక్ వర్మ కూడా ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోవడంతో స్కోర్ కార్డు ఉరకలు పెట్టింది. ఈ క్రమంలో మొదట తిలక్ వర్మ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పాండ్య శివాలెత్తి 17 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. తిలక్, పాండ్య రెండో వికెట్ కు 118 పరుగులు జోడించడం ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది. ఇన్నింగ్స్ 14 ఓవర్లో టీమిండియా ఏకంగా 27 పరుగులు రాబట్టింది.
5th T20I, Ahmedabad: India beat South Africa by 30 runs to clinch five match series 3-1
— ANI (@ANI) December 19, 2025
(Pic: BCCI) pic.twitter.com/muYvj8B7dV
