నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన ఈడీ

నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన ఈడీ

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దాఖలు చేసిన ఛార్జీషీట్‎ను రౌస్ అవెన్యూ కోర్టు  తిరస్కరించడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఫిర్యాదును విచారించడానికి ట్రయల్ కోర్టు నిరాకరించడాన్ని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం (డిసెంబర్ 19) ఢిల్లీ హైకోర్టులో ఈడీ అప్పీల్ దాఖలు చేసింది. మనీలాండరింగ్‌కు సంబంధించిన కీలకమైన సాక్ష్యాలను ట్రయల్ కోర్టు విస్మరించిందని పిటిషన్‎లో పేర్కొంది. నిందితులపై కేసు నమోదు చేసి, సమన్లు జారీ చేసేలా దిగువ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని ఈడీ కోరింది.

ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన మనీలాండరింగ్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు మంగళవారం(డిసెంబర్ 16) కొట్టివేసింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జీ షీట్‎ను పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి (పిసి యాక్ట్) విశాల్ గోగ్నే తోసిపుచ్చారు. సరైన సాక్ష్యాలు లేవని భావించి సోనియా, రాహుల్ గాంధీలను ప్రాసిక్యూషన్ నుంచి తప్పించారు.  

ఏంటీ నేషనల్ హెరాల్డ్ కేసు..

నేషనల్ హెరాల్డ్ పత్రికలో మనీలాండరింగ్ జరిగిందని 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి కోర్టులో పిటిషన్ వేశారు.  పిటిషన్‎ను కోర్టు పరిశీలించిన తర్వాత 2021లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఫిర్యాదులో సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, దివంగత నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ వంటి కీలక కాంగ్రెస్ ప్రముఖులు, సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ కంపెనీలు మనీలాండరింగ్‎కు కుట్ర చేశారని ఆరోపించింది.

అసోసియేట్ జనరల్ లిమిటెడ్ (AJL)కి చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను మోసపూరితంగా సంపాదించారని ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సోనియా, రాహుల్ గాంధీ, యంగ్ ఇండియన్ లో మెజార్టీ వాటాదారులు, ఒక్కొక్కరికి 38 శాతం వాటా ఉంది. ఈ కేసులో గతంలో రాహుల్, సోనియాలో ఈడీ ప్రశ్నించింది.