IND vs SA: శివాలెత్తిన పాండ్య, చితక్కొట్టిన తిలక్: సౌతాఫ్రికా ముందు భారీ స్కోర్ సెట్ చేసిన టీమిండియా

IND vs SA: శివాలెత్తిన పాండ్య, చితక్కొట్టిన తిలక్: సౌతాఫ్రికా ముందు భారీ స్కోర్ సెట్ చేసిన టీమిండియా

సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా బ్యాటింగ్ లో దుమ్ములేపింది. శుక్రవారం (డిసెంబర్ 19)అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి చెలరేగి ఆడారు. హార్దిక్ పాండ్య (25 బంతుల్లో 63: 5 ఫోర్లు, 5 సిక్సులు) అసాధారణంగా రెచ్చిపోతూ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో పాటు తిలక్ వర్మ (42 బంతుల్లో 73: 10 ఫోర్లు, సిక్సర్) మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. తిలక్ వర్మ 73 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు.. లిండే, బార్ట్ మాన్ తలో వికెట్ పడగొట్టారు.  

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు ఓపెనర్లు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. శాంసన్, అభిషేక్ శర్మ పవర్ ప్లే ను ఉపయోగించుకుంటూ బౌండరీల మోత మోగించారు. తొలి వికెట్ కు 63 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ (34) ఔటయ్యాడు. ఓపెనర్ల విజృంభణతో ఇండియా పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఈ దశలో శాంసన్ తో కలిసి తిలక్ వర్మ జట్టును ముందుకు తీసుకెళ్లారు. 37 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించిన శాంసన్ ను ఒక అద్భుత డెలివరీతో లిండే బౌల్డ్ చేశాడు. 

తిలక్ వర్మకు జత కలిసిన హార్దిక్ పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి బంతికే సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్ ఆరంభించిన పాండ్య తన దూకుడును ఇన్నింగ్స్ మొత్తం చూపించాడు. మరో ఎండ్ లో తిలక్ వర్మ కూడా ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోవడంతో స్కోర్ కార్డు ఉరకలు పెట్టింది. ఈ క్రమంలో మొదట తిలక్ వర్మ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పాండ్య శివాలెత్తి 17 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. తిలక్, పాండ్య రెండో వికెట్ కు 118 పరుగులు జోడించడం ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది. ఇన్నింగ్స్ 14 ఓవర్లో టీమిండియా ఏకంగా 27 పరుగులు రాబట్టింది.