తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: నెదర్లాండ్స్ NRI లకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: నెదర్లాండ్స్ NRI లకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపు

పెట్టుబడుల రంగంలో భవిష్యత్ ఇండియాదేనని అన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పారిశ్రామిక, ఇతర రంగాల్లో పెట్టుబడులకు గమ్యస్థానం భారత్ అని అన్నారు. వికసిత్ భారత్ -2047 రోడ్ మ్యాప్ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా మారిందని.. ఈ దశలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఇన్వెస్టర్లను ఆకర్షించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం (డిసెంబర్ 19) ఢిల్లీలో నెదర్లాండ్స్ NRI లు స్థాపించిన ఫౌండేషన్ ఫర్ క్రిటికల్ ఛాయిసెస్ ఫర్ ఇండియా(FCCI) ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనీ ఈ సందర్భంగా ఎన్నారైలకు పిలుపునిచ్చారు ఎంపీ వంశీకృష్ణ. నెదర్లాండ్స్- భారత్ బంధం విడదీయలేనిదని.. పారిశ్రామిక విప్లవాన్ని సృష్టిస్తున్న FCCI సభ్యుల శ్రమ మరవలేనిదని కొనియాడారు. FCCI ద్వారా దేశ రుణం తీర్చుకునేలా కార్యక్రమాలు చేపట్టడం గర్వ కారణమని అన్నారు. 

దేశ అభివృద్ధిలో విశాఖ ఇండస్ట్రీస్ సైతం తనవంతు పాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా ఎంపీ చెప్పారు. ప్రస్తుతం దేశంలో కాలుష్యం తో పాటు పర్యావరణ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. పర్యావరణ హితమైన ఉత్పత్తులనే విశాఖ ప్రోత్సహిస్తోందని తెలిపారు. బిల్డింగ్ నిర్మాణ మెటీరియల్, రూఫ్స్, సోలార్ రంగంలోనూ అద్బుతాలు సృష్టిస్తున్నామని చెప్పారు. విశాఖ ఇండస్ట్రీస్ సోలార్ టైల్స్ యూఎస్ పేటెంట్ ను దక్కించుకుందని గుర్తు చేశారు. 

వికసిత్ భారత్లో మా వంతు పాత్ర పోషిస్తున్నాం..

వికసిత్ భారత్ లో తమ వంతు పాత్ర ను పోషిస్తున్నట్లు చెప్పారు ఎన్నారైలు. FCCI  ఏర్పాటు చేసి 45 ఏండ్లు అవుతోందని.. అలాగే ఈ ఏడాదికి ఇండియా- నెదర్లాండ్స్ మైత్రికి 75 ఏండ్లు నిండనున్నాయని తెలిపారు. ఈ దిశలో భారత సంతతి వారిగా దేశ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు FCCI  వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ అగర్వాల్ తెలిపారు.

పెట్టుబడుల్లో భారత్, ప్రధానంగా తెలంగాణలు గమ్యస్థానాలుగా నిలిచాయని ఆయన అన్నారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ సైతం ప్యానెల్ చర్చలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి పాలసీని వివరించినట్లు చెప్పారు. పర్యావరణ హితంగా విశాఖ సంస్థ తీసుకువచ్చిన ఉత్పత్తులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.


తెలంగాణ బిడ్డగా FCCI  లో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు  FCCI సభ్యులు  సముద్రాల సాయి కిరణ్. నెదర్లాండ్స్ లో పారిశ్రామిక వేత్తగా రాణిస్తు్న్నట్లు చెప్పారు. మారుతున్న కాలంలో తెలంగాణ పెట్టుబడులకు గమ్య స్థానంగా నిలుస్తోందని కొనియాడారు.

ఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల (డిసెంబర్ 19,20) కాన్ఫరెన్స్ లో  నెదర్లాండ్స్ ఎన్నారైలు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను  సత్కరించారు ఎఫ్ సీసీఐ ప్రెసిడెంట్ అడ్వకేట్ జస్బీర్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రమోద్ అగర్వాల్. ఇండియా డయస్పోరా: డెడికేటెడ్ టు ది ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియా.. అంజెడ అంశంపై ప్రసంగించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ.