BBL 2025-26: బిగ్ బాష్ లీగ్‌లో వండర్.. 258 పరుగుల టార్గెట్ కొట్టేసిన బ్రిస్బేన్

BBL 2025-26: బిగ్ బాష్ లీగ్‌లో వండర్.. 258 పరుగుల టార్గెట్ కొట్టేసిన బ్రిస్బేన్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో అద్భుతం చోటు చేసుకుంది. పెర్త్ స్కార్చర్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికార్డ్ ఛేజింగ్ నమోదయింది. శుక్రవారం (డిసెంబర్ 19) బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరిగిన మ్యాచ్ లో పెర్త్ స్కార్చర్స్ పై బ్రిస్బేన్ హీట్ ఏకంగా 258 పరుగుల టార్గెట్ ఛేజ్ చేసి ఆశ్చర్యపరించింది. భారీ ఛేజింగ్ కళ్ళముందు కనబడుతున్నా ఎలాంటి తడబాటు లేకుండా సరదాగా కొట్టేశారు.  రెన్‌షా (51 బంతుల్లో 102), వైల్డర్‌ముత్ (54 బంతుల్లో 110) సెంచరీలతో విజృంభించి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయాన్ని అందించారు. 

బిగ్ బాష్ లీగ్ లో ఇదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. ఓవరాల్ గా టీ20 క్రికెట్ చరిత్రలో మూడోది. తొలి స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. 2024 ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా జట్టుపై పంజాబ్ 262 పరుగుల టార్గెట్ ఛేజ్ చేసి టాప్ లో ఉంది. అంతర్జాతీయ క్రికెట్ లో 259 పరుగుల టార్గెట్ ను వెస్టిండీస్ పై సౌతాఫ్రికా ఛేజ్ చేసి రెండో స్థానంలో ఉంది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో రెండు జట్లు కలిపి 515 పరుగులు చేయడం హైలెట్ గా నిలిచింది.  

►ALSO READ | IND vs SA: శివాలెత్తిన పాండ్య, చితక్కొట్టిన తిలక్: సౌతాఫ్రికా ముందు భారీ స్కోర్ సెట్ చేసిన టీమిండియా

ఈ మ్యాచ్ స్టేడియంలో ఉన్న అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. మ్యాచ్ మొత్తంలో రెండు జట్లు బౌండరీల వర్షం కురిపిస్తూ స్టేడియాన్ని హోరెత్తించారు. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఫిన్ అల్లెన్ (79), కూపర్ కొన్నోల్లీ (77) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్ కు కేవలం 63 బంతుల్లోనే 142 పరుగులు జోడించి వీర ఉతుకుడు ఉతికారు. నిక్ హాబ్సన్ 11 బంతుల్లోనే 26 పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 257 పరుగులకు చేరింది. లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ గెలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. 

258 పరుగుల టార్గెట్ ఛేజింగ్ లో ఆ జట్టు తొలి బంతికే మున్రో వికెట్ ను కోల్పోయింది. దీంతో బ్రిస్బేన్ జట్టు విజయంపై ఆశలు తగ్గిపోయాయి. అయితే ఈ దశలో రెన్‌షా (51 బంతుల్లో 102), వైల్డర్‌ముత్ (54 బంతుల్లో 110) చెలరేగి ఆడారు. ఆరంభం నుంచి ఎటాకింగ్ చేస్తూ పెర్త్ బౌలర్లపై ఆధిపత్యం చూపించారు.  ప్రతి ఓవర్ లో బౌండరీలు బాదుతూ లక్ష్యాన్ని చిన్నగా కరిగిస్తూ వచ్చారు. ఈ సమయంలో ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మరోవైపు వేగం ఆడుతూ మొదట వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్న రెన్ షా ఔటయ్యాడు. చివర్లో మాక్స్ బ్రయంట్ (16 బంతుల్లో 28) తో కలిసి వైల్డర్‌ముత్ మ్యాచ్ ను ఫినిష్ చేశాడు.