వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను..రిపేర్​ చేయండి : మంత్రి కోమటిరెడ్డి

వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను..రిపేర్​ చేయండి : మంత్రి కోమటిరెడ్డి
  •     ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడండి : మంత్రి వెంకట్​ రెడ్డి
  •     విజయవాడ నేషనల్​ హైవేపై 17 బ్లాక్​ స్పాట్లు బాగు చేయండి
  •     రీజినల్​ రింగ్ రోడ్డు పూర్తయితే రాష్ట్రం డెవలప్​ అవుతుందని వెల్లడి
  •     రాష్ట్ర, జాతీయ రహదారుల అధికారులతో  రివ్యూ

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల అనేక చోట్ల రోడ్లు పాడయ్యాయని, వాటిపై వెంటనే శ్రద్ధ తీసుకొని రిపేర్​ చేయాలని అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులతో  ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి, వెంటనే సమస్య పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. శుక్రవారం వెంకట్​రెడ్డి సెక్రటేరియట్​లో  రాష్ట్ర, జాతీయ రహదారుల అధికారులతో రివ్యూ నిర్వహించారు.

రాబోయే వర్షాకాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని, ముందుస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
హైదరాబాద్–విజయవాడ నేషనల్​ హైవేపై జరుగుతున్న ప్రమాదాల్లో రోజూ పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారని, దీన్ని నివారించే చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ రహదారిపై 17 బ్లాక్​ స్పాట్​లు ఉన్నట్టు అధికారులు గుర్తించారని, వాటిని తక్షణం రిపేర్​ చేయాలని ఆదేశించారు.

అవసరమైతే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి, అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. బ్లాక్​స్పాట్​ ప్రాంతాల్లో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజల ప్రాణాలు పోతుంటే అధికారిక అనుమతుల పేరిట పనులు ఆలస్యం చేయకూడదని, సమస్యలను స్పెషల్​ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లి తక్షణం పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

వాహనాలు అతివేగంగా వెళ్లకుండా కట్టడి చేయాలని సూచించారు. అవసరం ఉన్న చోట రోడ్లను ఆరు లేన్లుగా విస్తరించాలని అన్నారు.  జంక్షన్లను అభివృద్ధి చేయాలని చెప్పారు. వెహికల్​ అండర్​ పాస్​ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. రోడ్డుకిరువైపులా సర్వీస్​ రోడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆర్ఆర్ఆర్​​ పనులు వేగవంతం చేయాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్​ రింగ్​రోడ్డు ​పనులను వేగవంతం చేయాలని అధికారులను  మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆదేశించారు. ఆర్ఆర్ఆర్​ ప్రాజెక్టుకు కేంద్రం 2021లోనే అనుమతులిచ్చినా.. నాటి ప్రభుత్వం (బీఆర్​ఎస్​) పట్టించుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు. తెలంగాణలో సగభాగం విస్తరించి ఉన్న ఈ రోడ్డును పూర్తి  చేస్తే రాష్ట్రం ఎంతో పురోగతి సాధిస్తుందని అన్నారు. యుటిలిటీ చార్జీల విషయంలో గత సర్కారు కొర్రీలు పెట్టిందనీ, దీనిపై సీఎం, తాను కలిసి కేంద్రాన్ని ఒప్పించామని చెప్పారు. రూ. 363.43 కోట్ల యుటిలిటీ చార్జీలను చెల్లిస్తామని కేంద్రానికి లేఖ ఇచ్చామని తెలిపారు.