గోదావరికి రికార్డు వరద.. 35 ఏండ్లలో ఇదే అత్యధికం

గోదావరికి రికార్డు వరద.. 35 ఏండ్లలో ఇదే అత్యధికం
  • 4 నెలల్లో సముద్రంలోకి 2,500 టీఎంసీల నీళ్లు
  • ఒక్క సెప్టెంబర్‌‌ నెలలోనే 1200 టీఎంసీలు వృథా
  • ఈ వానాకాలంలో భారీ వర్షాలు, ప్రవాహాలు
  • ఎస్సారెస్పీ నుంచి తుపాకుల గూడెం వరకు గేట్లన్నీ ఖుల్లా

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: ఈ వానాకాలం సీజనంతా భారీ వర్షాలు, ఎగువనుంచి ప్రవాహాలు రావడంతో గోదావరి నదికి వరదలు పోటెత్తాయి. దీంతో ఈ ఏడాది వరదల్లో గోదావరి 35 ఏండ్ల రికార్డును తిరగరాసింది. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదికి 1986లో వచ్చిన వరదలే ఇప్పటి వరకు అధికం. ఇన్నేండ్లలో ఆ స్థాయిలో మళ్లీ వరదలు రాలేదు. ఈ ఏడాది మాత్రం అంతకుమించి వరదలు వచ్చినట్లు ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు చెప్తున్నారు. జూన్‌‌ ఫస్ట్‌‌ నుంచి ఇప్పటి వరకు కేవలం నాలుగు నెలల్లోనే 2,500 టీఎంసీలకు పైగా గోదావరి నీళ్లు సముద్రం పాలయ్యాయి. కాళేశ్వరం నుంచి ఏటా ఎత్తిపోద్దామనుకున్న నీటికి (225 టీఎంసీలు) ఇది 11 రెట్లు కావడం విశేషం. కిందటేడు వానలు బాగా పడ్డప్పటికీ ఏడాది పొడవునా 1,800 టీఎంసీల నీళ్లు మాత్రమే బంగాళాఖాతంలో కలిశాయి. 

11.60 లక్షల క్యూసెక్కులు.. 
ఈ ఏడాది గోదావరి నదికి వరద ఎక్కువగా వచ్చింది. ప్రాణహితలో పెద్దగా ఫ్లడ్ లేదు. ఆగస్టులో భారీ వర్షాలతో తొలిసారి మేడిగడ్డ బ్యారేజీకి జులై 23న 11.60 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. సెప్టెంబర్‌‌ 8న 11.01 లక్షలు, సెప్టెంబర్‌‌ 29న 10.34 లక్షల క్యూసెక్కులకు పైగా ఫ్లడ్ వచ్చింది. ఎల్లంపల్లి బ్యారేజీ నిర్మాణం 2013లో జరగ్గా అప్పటి నుంచి అత్యధికంగా ఒక రోజుకు 4 లక్షల క్యూసెక్కుల నీళ్లు మాత్రమే కాళేశ్వరం వైపు వచ్చేది. ఈసారి 6.5 లక్షల క్యూసెక్కులు దాటింది. గత 9 ఏండ్లలో ఇదే రికార్డు స్థాయి వరద. ఈసారి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలలోనే 1,200 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలవడం రికార్డని ఆఫీసర్లు చెప్తున్నరు.
తెంపులేని వానలు.. భారీగా వరదలు
ఏటా గోదావరికి ఒకసారి వరదరావడమే విశేషం. అలాంటిది ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు వరదలు వచ్చిపోయాయి. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనాలు, గులాబ్ ఎఫెక్ట్​ వల్ల జులై, ఆగస్టు, సెప్టెంబర్‌‌లో భారీ వర్షాలు కురిశాయి. ఎగువన మహారాష్ట్ర తో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో మూడు దఫాలు మూడు రోజులకు తగ్గకుండా భారీ వాన పడింది. దీంతో గోదావరికి జులైలో మొదలైన వరద వంద రోజులుగా ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్‌‌లో దాదాపు నదిపై అన్ని ప్రాజెక్టులు, బ్యారేజీల గేట్లు మూసేస్తుంటారు. ఈసారి అక్టోబర్​లో 5వ తేదీ వచ్చినా ప్రతిరోజూ సుమారు 4 లక్షల క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు సార్లు వరదలు వచ్చినట్లు ఒక్కోరోజు 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వెళ్లినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.
గోదావరిలో పెరిగిన ప్రవాహం
1986లో గోదావరికి వరదలప్పుడు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద 13.50 మీటర్ల ఎత్తుతో నది ప్రవహిస్తే ఈ ఏడాది జులై 23న 13.74 మీటర్ల హైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నది ప్రవహించినట్లు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు తెలిపారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద 1986లో 14 మీటర్ల హైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నది ప్రవహిస్తే ఈ ఏడాది జులై 24న 14.54 మీటర్ల హైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నది ప్రవాహం ఉందని ప్రకటించారు. రాష్ట్రంలో ఎగువన నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఎస్సారెస్పీ నుంచి మొదలుకొని దిగువన ములుగు జిల్లా తుపాకుల గూడెం బ్యారేజీ వరకు గోదావరిలో 1986కు మించి ప్రవాహ ఉధృతి కనిపించింది. గత 45 రోజులుగా గోదావరిపై అన్ని బ్యారేజీల గేట్లు తెరిచి వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సముద్రం వైపు పంపిస్తున్నట్లు చెబుతున్నారు. 

ఎస్సారెస్పీ రికార్డ్ బ్రేక్​
నిజామాబాద్, వెలుగు: ఎన్నడూ లేనట్లు ఈ వానాకాలంలో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. ఈ సీజన్​లో మొత్తం 555 టీఏంసీల వరద ఎస్సారెస్సీలోకి చేరింది. ఈ యేడాది జూన్, జులై, సెప్టెంబర్‌‌లో భారీ వానలు పడ్డాయి. మహారాష్ట్రలోని గోదావరి క్యాచ్​మెంట్ ఏరియాలో వర్షాలు పడుతుండడంతో గత జులై 10 నుంచి ఎస్సారెస్పీలోకి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. 23 ఏండ్ల రికార్డు బ్రేక్ అయ్యింది. 1998లో సాగర్​లోకి  536 టీఎంసీల వరద వచ్చింది. సోమవారం ఉదయం వరకు 555 టీఎంసీల వరద ఎస్సారెస్పీలోకి చేరింది. జులై 11న 24 టీఎంసీల వరద వచ్చింది. అవుట్​ఫ్లో రికార్డు స్థాయిలోనే ఉంది. 1986 జులైలో 6 లక్షల క్యూసెక్కుల వరద గోదావరిలోకి వదలగా 35 ఏండ్ల తర్వాత ఈఏడాది జులై 22న 6 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు.