హైదరాబాద్, వెలుగు: రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులన్నీ ఇవ్వాలని పీవోడబ్ల్యూ, పీవైఎల్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డుపై 9 రకాల సరుకులు పంపిణీ చేసేవని గుర్తుచేశారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఉప్పు, పప్పులు, కారం, నూనె, గ్యాస్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయంటూ ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో సివిల్ సప్లయ్స్ భవన్‌ను ముట్టడించారు.
ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు స్వరూప, శిరోమణి, కాశీనాథ్, ప్రదీప్ మాట్లాడారు. ‘‘రేషన్ షాపుల్లో బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ఆ బియ్యం కూడా తినేలా లేవు. అందుకే వాటిని అమ్ముకుంటున్నారు. ఈ బియ్యానికి ప్రభుత్వం కేజీకి రూ.39.18 ఖర్చు చేస్తున్నది. ఏ గ్రేడ్ రకం క్వింటాల్ వరికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 మద్దతు నిర్ణయించింది. దొడ్డు, సన్న బియ్యానికి రేటులో పెద్దగా తేడా లేదు. అందుకే సన్న బియ్యం ఇవ్వాలి”అని డిమాండ్ చేశారు. కొత్త వారికి రేషన్ కార్డులతో పాటు రూ.500కే సిలిండర్ ఇవ్వాలన్నారు. సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తర్వాత సివిల్ సప్లై జాయింట్ కమిషనర్ ఉషారాణికి ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేసింది.
