- హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నుంచే 80 శాతం కమర్షియల్ ట్యాక్స్
- గత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధి తో రూ.78 వేల కోట్లు
- పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణతో పెరుగుతున్న ఆదాయం
- అదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ లేక ఇతర జిల్లాల్లో తగ్గుతున్న రాబడి
- వాణిజ్య పన్నుల రాబడిలో జిల్లాల నడుమ తీవ్ర వ్యత్యాసం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే వాణిజ్య పన్నుల రాబడిలో జిల్లాల నడుమ తీవ్ర వ్యత్యాసం కనిపిస్తున్నది. కమర్షియల్టాక్స్లో సింహభాగం హైదరాబాద్ సహా దాని చుట్టూ ఉన్న నాలుగు జిల్లాల నుంచే వస్తుండగా, మిగతా జిల్లాలు వెనుకబడిపోతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 75,129 కోట్ల ఆదాయం రాగా, తాజాగా ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధిరేటుతో పన్నుల రాబడి రూ.78,706 కోట్లకు చేరింది. ఈ మొత్తం ఆదాయంలో దాదాపు 80 శాతం వాటా కేవలం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల నుంచే వచ్చింది.
జీఎస్టీ శ్లాబులు మారినప్పటికీ, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్న ఈ నాలుగు జిల్లాల వల్లే ప్రభుత్వ ఖజానాకు గండం తప్పింది. గత ఏడాది సెప్టెంబర్ 22న జీఎస్టీ శ్లాబులను కేంద్రం సవరించింది. దీంతో ఆదాయం తగ్గుతుందని భావించగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇన్‌కం పెరిగింది. గడిచిన అక్టోబర్ లో రూ.3,914 కోట్లు, నవంబర్‌లో రూ.3,733 కోట్లు, డిసెంబర్లో రూ.3,459 కోట్లు, జనవరిలో రూ.4,047 కోట్లు, ఫిబ్రవరిలో రూ.4,006 కోట్లు, మార్చిలో రూ.4,230 కోట్లు జీఎస్టీ ఇన్‌కం రాష్ట్ర ఖజనాకు చేరడం విశేషం.
ఐటీ కారిడార్ ఖర్చంతా ఇక్కడే
రాష్ట్ర వాణిజ్య పన్నుల లెక్కలను విశ్లేషిస్తే.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.44,450 కోట్లు, మద్యంపై వ్యాట్ ద్వారా రూ.16,942 కోట్లు, పెట్రోల్ ఉత్పత్తుల ద్వారా రూ.16,346 కోట్లు ప్రభుత్వానికి సమకూరాయి. ముఖ్యంగా గడిచిన ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో (అక్టోబర్–-మార్చి) జీఎస్టీ వసూళ్లు 8.1 శాతం వృద్ధిని నమోదు చేయడం సానుకూల అంశం.
ఐటీ కారిడార్ విస్తరణ, రియల్ ఎస్టేట్ రంగంలో జోరు, కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలు అన్నీ ఈ నాలుగు జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉండడంతో ఇక్కడ పన్నుల వసూళ్లు భారీగా ఉంటున్నాయి. జీఎస్టీ అనేది వినియోగం ఆధారిత పన్ను కావడంతో, కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్న ఈ నగర ప్రాంతాల్లోనే రాబడి ఎక్కువగా నమోదవుతున్నది. మరోవైపు, హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోవడమే ఈ ఆదాయ వ్యత్యాసానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నారాయణపేట, ములుగు, భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో పారిశ్రామికీకరణ ఆశించిన స్థాయిలో లేదు. ఆయా జిల్లాల్లో ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడడం, తయారీ రంగం నామమాత్రంగా ఉండడంతో రాష్ట్ర పన్నుల వాటాలో వీటి వాటా 1 నుంచి 2 శాతానికే పరిమితమవుతోంది. సరైన రవాణా వ్యవస్థ, మౌలిక వసతుల కొరత కారణంగా కొత్త పరిశ్రమలు మారుమూల జిల్లాలకు వెళ్లకపోవడంతో ఈ ప్రాంతీయ అసమానతలు మరింత పెరుగుతున్నాయి.
జిల్లాల్లో పరిశ్రమలు, మౌలిక వసతులు పెరిగితేనే
అన్ని జిల్లాల నుంచి ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం తక్షణమే వ్యూహాత్మక మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘వన్ డిస్ట్రిక్ట్ - వన్ ప్రొడక్ట్’ (ఓడీఓపీ) పథకాన్ని కాగితాలకే పరిమితం చేయకుండా, జిల్లాల్లో పండే పంటలకు అక్కడే ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. దీంతో ఉత్పత్తులకు ‘వాల్యూ అడిషన్’ జరిగి పన్ను రాబడి పెరుగుతుందని చెప్తున్నారు. ఐటీ, సర్వీస్ రంగాలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం వంటి టైర్-2 నగరాలకు యుద్ధ ప్రాతిపదికన విస్తరించాలంటున్నారు.
అప్పుడే ఆయా ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరిగి, తద్వారా పన్నుల ఆదాయం కూడా వృద్ధి చెందుతుందని సలహా ఇస్తున్నారు. దీంతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడం, పారిశ్రామిక రంగాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడం ద్వారానే సమతుల్యమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్తున్నారు. కేవలం పట్టణ ప్రాంతాలపైనే ఆధారపడకుండా, పన్ను ఎగవేతలను అడ్డుకునేందుకు డిజిటల్ నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
