న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ల (వయసు 60–80 ఏళ్లు) ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీల) పై ప్రస్తుతం స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్, ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈనెల 10 నాటి లెక్కల ప్రకారం, గరిష్ట వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై 8.3శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. వీటిలో పొదుపు చేసి ఎక్కువ లాభాలను పొందొచ్చు. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 21 నెలల 1 రోజు నుంచి 22 నెలల కాలపరిమితిపై 8.3శాతం వడ్డీ ఇస్తోంది. ఈక్విటాస్, ఈశాఫ్, సూర్యోదయ్, ఉత్కర్ష్ వంటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వివిధ కాలపరిమితులపై 8.25శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఉజ్జీవన్ ఎస్‌ఎఫ్‌బీ 3 ఏళ్ల పైబడిన డిపాజిట్లపై 8.05శాతం వడ్డీ అందిస్తోంది.
ప్రైవేట్ రంగ బ్యాంకులు 7శాతం నుంచి 8శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులలో డీసీబీ బ్యాంక్ అందరికంటే ముందుండగా, ఇతర బ్యాంకులు సాధారణ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. డీసీబీ బ్యాంక్ 24 నెలలు, 34 నెలలు, 60 నెలల టెన్యూర్‌లపై అత్యధికంగా 8శాతం వడ్డీ ఇస్తోంది.
సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్ల కంటే పైబడిన వారికి) మరో 0.05శాతం అదనంగా ఇస్తోంది. ఇండస్ఇండ్, బంధన్, యెస్ బ్యాంకులు 7.75శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఐసీఐసీఐ 7.1శాతం (3 నుంచి 5 ఏళ్లు), హెచ్‌డీఎఫ్‌సీ 7శాతం, యాక్సిస్ బ్యాంక్ 7.2శాతం వడ్డీని అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) 3 ఏళ్ల కాలపరిమితిపై గరిష్టంగా 7.45శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ఎస్‌బీఐ 5 నుంచి 10 ఏళ్ల లాంగ్‌టర్మ్ డిపాజిట్లపై 7.05శాతం వడ్డీ ఇస్తోంది.
