ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్లో ఎందుకు విలీనం కావాలి?

ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్లో  ఎందుకు విలీనం కావాలి?

ఆర్ఎస్ఎస్, బీజేపీలు  ప్రాంతీయ పార్టీలను  చంపేయాలని నిర్ణయించుకున్నాయి. అవి కాంగ్రెస్​ ముక్త్​ భారత్​ అంటే ప్రాంతీయ పార్టీలు మాకేం కాదని భావించాయి. కాంగ్రెస్, రాహుల్​గాంధీ తెగించి పోరాడుతున్నందువల్ల కనీసం దక్షిణాదిలో అది బతికి ఉన్నది.  కానీ, దేనికి తెగించి అయినా దేశంలో ప్రతిపక్షం లేకుండా చేసి మొత్తం పార్లమెంటు మాదే అనిపించుకుని రాజ్యాంగాన్ని మార్చెయ్యాలనేది ఆర్ఎస్ఎస్  ప్లాను.  

దేశంలోని అతిపెద్ద పెట్టుబడిదారులు సైతం దేశంలోని  మొత్తం భూమిని,  ఇతర వనరులను తమ చేతిలోకి తీసుకుని గుప్తయుగం నాటి బ్రాహ్మణ– బనియా తమ స్వర్ణయుగాన్ని తిరిగి స్థాపించాలనేది వారి ఆలోచన.  హిందూ రాష్ట్ర అంతిమ లక్ష్యం సర్వజన స్వర్ణయుగం కాదు. శూద్రులకు, దళితులకు, ఆదివాసీలకు అందులో గుప్తయుగం నాటి స్థానమే ఉంటుంది. అది ద్విజుల స్వర్ణయుగం. 

సావర్కర్​ ఎస్సెన్షియల్స్​ఆఫ్​ హిందూత్వంలో రాసినట్టు అది కేవలం ముస్లింలను,  క్రిస్టియన్లను  పక్కకుపెట్టి  మిగతా అన్ని కులాలకు సమాన హక్కులుగల  స్వర్ణయుగం తెస్తారనుకున్నా పొరపాటే.  బ్రాహ్మణ–బనియాల ఆధిపత్యంలేని తెలంగాణ రాష్ట్రంలో  కులసర్వే చూపించిన ఆర్థిక వనరుల ఆధిపత్యం చూస్తే అర్థమౌతుంది.  బ్రాహ్మణ,  వైశ్య,  జైన, మార్వాడీల ఆర్థిక ఆధిపత్యం తెలంగాణ మిగతా అన్ని శూద్ర కులాలకన్నా ఎక్కువ. పెట్టుబడిలో  తెలంగాణ రెడ్డి, వెలమల పెట్టుబడి శక్తి వారిముందు  చాలా చిన్నది.  ఈ శక్తి  గత 12 సంవత్సరాలలో  దేశం మొత్తం ద్విజకులాల్లో పెట్టుబడి పెరుగుతూ పోవడాన్ని  మనం చూడవచ్చు.  ముఖ్యంగా అంబానీ, అదానీల పెట్టుబడి అండతో  మొత్తం రాజకీయ వ్యవస్థను కూడా ఆర్ఎస్ఎస్,  బీజేపీ  మార్చేస్తున్నాయి. 

  • ప్రతిపక్ష పార్టీలు చిన్నాభిన్నం

తృణమూల్​ కాంగ్రెస్​ను ఎన్నికల్లో ఓడిపోయిన కొద్దిరోజులకే  చిన్నాభిన్నం చేశారు.  దురదృష్టవశాత్తు ఆ రాష్ట్రంలో గత 75 ఏండ్లుగా బ్రాహ్మణులు, కాయస్తులు మాత్రమే దాన్ని పరిపాలిస్తున్నారు. శూద్రులు, నామశూద్రులు (దళితులు) ఇప్పటివరకు ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు.  గతంలో కాంగ్రెస్,  కమ్యూనిస్టు  పార్టీ పరిపాలించినా ఆ రెండు కులాల నాయకులే అధికారంలో  ఉన్నారు. బీజేపీ అధికారంలోకి  వచ్చాక కూడా బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి వచ్చిన  సువేందు  అధికారినే ముఖ్యమంత్రిని చేశారు.  ఆ రాష్ట్రంలో  మళ్లీ  భద్రలోక్​ శక్తుల అధికారమే కొనసాగుతున్నది. మొత్తం ఎన్నికల వ్యవస్థను స్పెషల్​ 
ఇంటెన్సివ్​  రివిజన్​(ఎస్ఐఆర్)  పేరుతో ఎక్కువ మంది తృణమూల్​కు ఓటేస్తారనుకున్నవారిని తొలగించారని ఆరోపణలున్నాయి. 

అందులో ముఖ్యంగా ముస్లిం ఓటర్ల పేర్లు తొలిగించారని కూడా ఆరోపణలున్నాయి.  ఏది ఏమైనా అటు ఎన్నికల సంఘం, ఇటు ఎన్​ఫోర్స్ మెంట్ ఏజెన్సీ, సీబీఐ తదితర సంస్థలు మొత్తం ప్రతిపక్ష పార్టీలను ఛిన్నాభిన్నం చేయడానికి బీజేపీ వాడుకుంటోంది. ఒడిశాలో నవీన్​ పట్నాయక్ పార్టీ అలానే చిన్నాభిన్నమైంది.  తమిళనాడులో డీఎంకే అధికారం కోల్పోయిన తరువాత చాలా భయాందోళనలో ఉన్నది.  కేరళలో కమ్యూనిస్టు పార్టీలు క్రమంగా కనుమరుగయ్యే స్థితి కనబడుతున్నది. బిహార్​లో ఆర్జేడీది అదే పరిస్థితి.  ఉత్తరప్రదేశ్​లో సమాజ్​వాదీ పార్టీని చాలా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అక్కడ అది కాంగ్రెస్​తో కలిసి 43 ఎంపీ సీట్లు గెలిచారు.  సమాజ్​వాదీ  పార్టీ ఒక్కటే 37 ఎంపీ స్థానాలను గెలుచుకుంది.  2024లో ఈవిధంగా సమాజ్ వాది పార్టీ గెలవడాన్ని బీజేపీ,  ఆర్ఎస్ఎస్  జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ స్థితిలో ప్రాంతీయపార్టీలు, కాంగ్రెస్​ఒక జాతీయస్థాయి అవగాహనకు రాకపోతే దేశం భయానక పరిస్థితిలోకి నెట్టబడుతుంది. దేశంలో ప్రతిపక్షం ఉండదు. 

  • తృణమూల్​ విలీన చర్య

తృణమూల్​ పార్టీ కాంగ్రెస్​లో విలీనమయ్యే అవకాశం గురించి చర్చ జరుగుతున్నది. ఇది కేవలం ఒక టీఎంసీకి వర్తించే అంశం మాత్రమే కాదు. క్రమంగా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ ఐక్య రూపంలో తీసుకోకపోతే దేశంలో ప్రజాస్వామ్యమే కాదు మొత్తం దేశం ప్రమాదంలోకి నెట్టబడుతుంది.  ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీలు కేవలం ముస్లింలను కంట్రోల్​ చేసి, టెర్రరిజాన్ని అణచివేస్తాయని మిగతా కులాలన్నీ భావించాయి. కానీ, ముస్లింలను ఒక మూలకునెట్టిన కొద్దికాలంలో దేశంలోని క్రిస్టియన్​ సంస్థలన్నింటి ఆస్తులను  క్రిస్టియన్ల నుంచి తీసేసి  ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించే ప్లానుతో  ముందుకుపోతున్నారు. 

ఈ క్రమంలో ముస్లిం దేశాలన్నీ, క్రిస్టియన్ దేశాలన్నీ ఈ దేశాన్ని తమ శత్రువు క్యాంపులో పెట్టేస్థితి కనబడుతున్నది. సెక్యులర్​ వ్యవస్థను  చితకకొట్టినాక హిందూ రాష్ట్రం ఏర్పడితే శూద్రులకు, దళితులకు, ఆదివాసీలకు అందులో ఏ హక్కులు ఉండవనేది ఒక అంశమైతే, అటు ముస్లిం దేశాలు,  క్రిస్టియన్  దేశాలు ఇండియాను ప్రమాదకర దేశంగా చూసే అవకాశం ఉంది. ముస్లిం దేశాలు ఇప్పటికే  ఇస్లామిక్​ నాటో ఫామ్ చేసుకుని పెద్ద ఎత్తున న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నాయి. అందులో పాకిస్తాన్ కూడా ఉంది. 

  • హిందూ ఐక్యత ఈ దేశంలో లేదు

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధకాలంలో పాకిస్తాన్ అమెరికాకు, ఇజ్రాయెల్​కు అతి మిత్ర దేశంగా మారింది. పాక్​ఇజ్రాయెల్ ఇప్పటికీ గుర్తించకపోయిన అది ఇజ్రాయెల్​కు మిత్ర దేశమే. ఇది ఇరాన్​ను ఒంటరిని చేసి మధ్య ఆసియాలో ఏర్పడిన కొత్త కూటమి. ఈస్థితిలో ఈ దేశంలోని  ప్రాంతీయ పార్టీలు,  కాంగ్రెస్ విడివిడిగా ఉండి.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా ప్రకటించగల శక్తిగా ఎదగనిస్తే మొత్తం దేశం ప్రమాదంలో పడిపోతుంది.  హిందూ రాష్ట్రానికి  ఇస్లామిక్​ ప్రపంచానికి (అందులో 56 దేశాలు ఉన్నాయి)  యుద్ధం మొదలైతే పరిస్థితి ఏంటి? అంతిమంగా నాశనమయ్యేది మనమే.  

ఎందుకంటే  ఆ  దేశాలు మతపరంగా సంపూర్ణ ఐక్యతతో ఉన్నాయి.  కానీ,  హిందూ ఐక్యత ఈ దేశంలో లేదు.  కింది కులాలను పై కులాలు ముఖ్యంగా బ్రాహ్మణ– బనియా పెట్టుబడిదారులు తమ కంపెనీల్లో ఉద్యోగాల్లో పెట్టుకునే పరిస్థితి లేదు. ఆస్తులన్నీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. కనీసం రిజర్వేషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉద్యోగాల్లోకి రావడాన్ని అగ్ర కులాలు ఇష్టపడే పరిస్థితి లేదు.  మతపరంగా పెండ్లిళ్లు కావు. అవి కులపరంగా జరుగుతుంటాయి.  హిందూ ఐక్యత, హిందూయిజంలో సమానత లేకుండా మొత్తం 56 ముస్లిం దేశాలు మతపరంగా ఒక్కటై మనపై  అన్ని రకాల దాడులు చేస్తే  ఒక్కదేశం ఎలా తట్టుకుంటుంది?

  • సెక్యులరిజంతో 75 ఏండ్లు ప్రజాస్వామ్యం బతికింది

ఇన్ని ముస్లిం దేశాల మధ్య ఉండి కూడా అవి ఐక్యం కాకుండా ఉంచి, పాకిస్తాన్​ను ఒంటరి చేయగలిగింది ఈ దేశంలోని సెక్యులర్ సిద్ధాంతం.  అయితే ఈ సిద్ధాంత ఆధిపత్యకాలంలో కూడా అగ్రకులాలే ఆధిపత్యంలో ఉన్నాయి. కులంపై చర్చించడానికి కూడా అవి అంగీకరించలేదు.  పెట్టుబడి ఇప్పుడున్న స్థాయిలో కాకపోయినా ఎక్కువగా వారి చేతిలోనే ఉంది. విశ్వవిద్యాలయాలు వారి చేతిలోనే ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక కులంపై చర్చ బలపడింది.  అది మంచిదే. కాంగ్రెస్​​ కూడా ఈ చర్చలోకి రావల్సివచ్చింది.  తెలంగాణలో, కర్నాటకలో  కుల సర్వేలు చేయించాల్సిన స్థితికి ఆ సెక్యులర్​ కాంగ్రెస్​ వచ్చింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్​ఈనాటికి దేశంలో అధికారంలో ఉంటే కులంపై ఇటువంటి చర్చ ముందుకొచ్చేదికాదు. 

అయితే ఆర్ఎస్ఎస్,  బీజేపీ మొత్తం  ప్రతిపక్షాల్ని తుడిచిపెట్టి హిందూ రాష్ట్రం ప్రకటిస్తే ఇంకో పెద్ద ప్రమాదం మతయుద్ధ ప్రమాదం. ఏనాడూ కూడా ముస్లిం దేశాలు సెక్యులరిజమనే చర్చను తమ దేశంలో జరగనియ్యలేదు. ఇప్పడు ఆర్ఎస్ఎస్, బీజేపీ అటువంటి ఆలోచనలో ఉన్నాయి. సెక్యులర్​ రాజకీయాలనే దేశంలో ఉండొద్దు అని వారి ఆలోచన. ఇకముందున్న  సంఘర్షణ దేశాల మధ్య మత యుద్ధాలకు దారి తీయడమే. మతపర దేశాల్లో ప్రజాస్వామ్యం ఉండదు. కనుక నా దృష్టిలో కాంగ్రెస్​ బాగా మారి ప్రాంతీయ పార్టీలన్నీ తనలోకి వచ్చి రాష్ట్రాల నుంచి ఎదిగిన శూద్ర, దళిత, ఆదివాసీ నాయకులు ప్రధాన మంత్రి అయ్యేస్థితికి రావడమే ఒక పరిష్కారం.

  • సెక్యులర్​ కవచం అవసరం

కాంగ్రెస్,  ప్రాంతీయ పార్టీలు ఐక్యమైన ఒక ప్రత్యామ్నాయ జాతీయ పార్టీగా రూపొందకుండా ప్రతిపక్షంగా కూడా అవి నిలబడలేవు. ఆర్ఎస్ఎస్, బీజేపీ  వేరే నిర్మాణాలను బతుకనియ్యవద్దు అనుకుంటున్నాయి. అందుకు అవి ఎన్నుకున్న మార్గాలు కులం, డబ్బుపరమైనవి.  హిందువులందరినీ సమానత్వంలోకి నెట్టాలనే కార్యక్రమమే లేదు. మొత్తం  దేశ సంపదను  రెండే రెండు కులాల పెట్టుబడిదారులు చేతుల్లోకి నెడుతున్నది. 

బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉండగా ఎంతమంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలలో కనీసం 100 మంది టాప్ పెట్టుబడిదారుల్లో ఉన్నారు?  పెట్టుబడి కులం ప్రకారం రూపుదిద్దుకున్నది కాకపోతే బనియా–బ్రాహ్మణులే పెట్టుబడిదారులు ఎందుకు అవుతున్నారు?  బీజేపీ అధికారంలోకి వచ్చాక  ఎంతమంది  రెడ్లో, వెలమలో, కమ్మలో, మరాఠాలో, పటేల్లో అదానీలా, అంబానీలా, వేదాంత్​లా, లక్ష్మీ మిట్టల్​లా  పెద్ద పెట్టుబడిదారులయ్యారు?  ఎంతమంది ఓబీసీలు అయ్యారు? ఎంతమంది దళితులయ్యారు? ఎంతమంది ఆదివాసీలయ్యారు?.  ఇక్కడో  అక్కడో  ఒక ముఖ్యమంత్రిని చేస్తే మార్పుకాదు.  మతంలో పూజారివర్గంలో  శూద్ర,  ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ వాటా ఏది?  మత ఐక్యత ఆధ్యాత్మిక, ఆర్థికరంగంలో జరగాలి కదా?

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​

Note:  ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.