వారం రోజులు వర్షాలు..రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ

వారం రోజులు వర్షాలు..రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, వెలుగు: రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంటూ, ఎల్లో అలర్ట్​జారీ చేసింది. పలు జిల్లాల్లో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. దక్షిణ జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్లు, మరికొన్ని జిల్లాల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

హైదరాబాద్‌‌‌‌లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇక వర్షాలు పడుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా టెంపరేచర్లు దిగొచ్చాయి. 8 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో టెంపరేచర్లు 40 డిగ్రీలలోపే నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్​లో 40.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌‌‌‌లో 40.5, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లిలో 40.3, నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 40.2, జగిత్యాల జిల్లా రాఘవపేట, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 40.1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, కరీంనగర్ జిల్లా మల్యాలలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

మరో రెండు రోజుల్లో అక్కడ కూడా టెంపరేచర్లు మరింత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక, రాష్ట్రంలో అత్యల్పంగా నాగర్​కర్నూల్ జిల్లాలో 36.2, రంగారెడ్డి జిల్లాలో 36.6 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్​లోని చాలా ప్రాంతాల్లో 36 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా బేంగపేట సర్కిల్‌‌‌‌లో 37.6, సికింద్రాబాద్ సర్కిల్‌‌‌‌లో 37.5, చాంద్రాయణగుట్టలో 37.2, ముషీరాబాద్​లో 37.1, గాజులరామారంలో 37 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. 

రాష్ట్రవ్యాప్తంగా వానలు..

రాష్ట్రంలో నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం పడింది. రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్​నగర్, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌‌‌‌‌‌‌‌లో 11.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా రేవల్లిలో 7.4 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా వర్కట్​పల్లిలో 6.8, వికారాబాద్ జిల్లా పెద్దుమంతల్​లో 6.5, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.3, మోయినాబాద్​లో 6.3 సెంటీమీటర్ల చొప్పున తేలికపాటి వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి.