ఇవాళ (నవంబర్ 2) హైదరాబాద్‎కు షా.. బషీర్‌‌‌‌బాగ్ నుంచి పాదయాత్ర

ఇవాళ (నవంబర్ 2) హైదరాబాద్‎కు షా.. బషీర్‌‌‌‌బాగ్ నుంచి పాదయాత్ర

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో బీజేపీ సోమవారం భారీ పాదయాత్రను నిర్వహించనుంది. దీనికి  కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బషీర్‌‌‌‌బాగ్​లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి పాదయాత్ర మొదలై అబిడ్స్ మీదుగా మొజంజాహీ మార్కెట్ వరకు సాగనున్నది. యాత్రలో దాదాపు 30 వేల నుంచి 40 వేల మంది పాల్గొనేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్​పోర్ట్ కు చేరుకోనున్న అమిత్ షా అక్కడ్నుంచి నేరుగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లనున్నారు. 

మధ్యాహ్నం 2 గంటల వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.15 నుంచి 3.55 గంటల వరకు అక్కడే లంచ్ చేయడంతో పాటు పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

పాదయాత్ర తర్వాత సభ

సాయంత్రం 4.15 గంటలకు బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం, నిజాం కాలేజీ వద్దకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడ్నుంచి ఎంజే మార్కెట్ వరకు సాగే  పాదయాత్రను ప్రారంభిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అమిత్ షాతో కలిసి అడుగులు వేయనున్నారు. 5.15 నుంచి 5.45 గంటల వరకు ఎంజే మార్కెట్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి అమిత్ షా మాట్లాడతారు. తర్వాత బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు చేరుకుని సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్తారు.

ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి, రాంచందర్ రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదివారం రాత్రి అమిత్​షా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ నుంచి ఎంజే మార్కెట్ వరకు నడిచి వెళ్లి రూట్ మ్యాప్, ట్రాఫిక్ డైవర్షన్లు, బందోబస్తు చర్యలు, సభా వేదిక ఏర్పాట్లను పర్యవేక్షించి నాయకులకు పలు సూచనలు చేశారు.