- అప్పటి వరకు కాంగ్రెస్ వానర సైన్యమై పోరాడుతుంది: సీఎం రేవంత్
- దేశంలో 20 కోట్ల ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర
- పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళల ఓట్లు చోరీ
- ప్రజా సంకల్పం ముందు మోదీ, షా తలవంచారు
- ఢిల్లీకి రాకుండా నిలువరించలేకపోయారని కామెంట్
- ఢిల్లీ ర్యాలీలో పాల్గొన్న పీసీసీ చీఫ్, మంత్రులు, ఎంపీలు
న్యూఢిల్లీ, వెలుగు: నాడు రావణుడిని ఓడించేందుకు రాముడికి వానర సేన తోడ్పడినట్లు, నేడు నరేంద్ర మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ వానర సైన్యం పోరాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ పోరాటంలో విజయం సాధించే వరకు విశ్రమించబోమన్నారు. తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను ‘వానరసైన్యం’గా అభివర్ణించారు. ‘‘ఓట్ బచావో– దేశ్ బచావో” నినాదంతో బీజేపీ నేతల గుండెలు అదిరేలా ఢిల్లీ పీఠాన్ని వణికించాలన్నారు.
రాంలీలా మైదానంలో కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకునే దీక్షతో... మోదీ గద్దె కూలక తప్పదని, ఆయన గుజరాత్ వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఈ చారిత్రాత్మక వేదికపై ఇండియా కూటమి నేతలు ఇచ్చే సందేశాన్ని ప్రతి గ్రామానికి, ఇంటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఛలో ఢిల్లీ– రామ్ లీలా మైదాన్’ ర్యాలీకి ముందు సీఎం తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రం నుంచి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్లో సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించి ప్రధాని మోదీ రెండు సార్లు అధికారంలోకి వచ్చారన్నారు.
20 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర
డాక్టర్ అంబేద్కర్ దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించారని, కానీ ఆ ఓటు హక్కును తొలగించేందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అడ్డుపెట్టుకొని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే 13.50 కోట్ల ఓట్లు తొలగించారని, మరో 20 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం ఓట్లలో 15 నుంచి 20 శాతం ఓట్లు తొలగించేందుకు వ్యూహాలు రచిస్తున్నారని చెప్పారు. ఓట్ల తొలగింపు ద్వారా బీజేపీ ఇప్పటికే బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిందని, కేంద్రంలోనూ మళ్లీ అలానే అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నారన్నారు.
తెలంగాణ గళం ముందు తలవంచారు
పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ నుంచి 15 వేల మంది వచ్చేలా రైళ్లు ఏర్పాటు చేస్తే, ఆఖరి నిమిషం వరకు నమ్మించి చివర్లో రైళ్లు రద్దు చేసి కార్యకర్తలు రాకుండా అడ్డుకున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. రైళ్లు ఇవ్వకపోయినా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా ఢిల్లీ వచ్చారని చెప్పారు. ‘‘మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ కార్యకర్తల సంకల్పాన్ని అడ్డుకోలేకపోయారు. తెలంగాణ బలం, గళం ముందు మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ తలవంచక తప్పలేదు”అని అన్నారు. అనంతరం కారుపై కూర్చొని కార్యకర్తలకు అభివాదం చేస్తూ సీఎం రేవంత్ సభ స్థలానికి బయలుదేరి వెళ్లారు.
సోనియా, రాహుల్, ఖర్గేలతో కలిసి
తెలంగాణ భవన్ నుంచి సీఎం నేరుగా రాజాజీ మార్గ్ లోని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి అగ్ర నేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, సంజయ్ రౌత్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ టాప్ జీపులో రాంలీలా మైదాన్‌కు వెళ్లారు.
దద్దరిల్లిన తెలంగాణ భవన్
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో ఢిల్లీ తెలంగాణ భవన్ దద్దరిల్లింది. వేలాది సంఖ్యలో కార్యకర్తలు ఉదయం 10 గంటలకే భవన్ చేరుకున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్, సర్, మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై తెలంగాణ.. జై కాంగ్రెస్.. ఓట్ చోర్– గద్దె చోడ్ నినాదాలతో భవన్ మార్మోగింది.
