హైదరాబాద్, వెలుగు: మురాసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. సదరన్, నార్తర్న్ డిస్కమ్ ఆఫీసర్లను అలర్ట్ చేసింది. విద్యుత్ సమస్యలు, అత్యవసర పరిస్థితులపై ప్రజలు 1912 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసింది.
తుఫాన్ వల్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి అత్యవసర మరమ్మతుల కోసం సిబ్బంది, వాహనాలు, పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. తుఫాన్ ప్రభావం ఉన్నంతకాలం అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించింది.
సదరన్ డిస్కమ్ పరిధిలోని 21 సర్కిళ్ల అధికారులు, ఫీల్డ్ సిబ్బంది సోమవారం ఉదయమే తమ తమ విధి నిర్వహణ కేంద్రాలకు తప్పనిసరిగా చేరుకోవాలని సీఎండీ జితేశ్ వి.పాటిల్ ఆదేశించారు. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలతో పాటు క్యూర్ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లను తనిఖీ చేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.
