ఆ ఆర్వోను ఉరితీసినా తప్పులేదు!..ఒక్క సీటు కోసం రాజ్యాంగ విలువలను..బీజేపీ తుంగలో తొక్కింది: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్

ఆ ఆర్వోను ఉరితీసినా తప్పులేదు!..ఒక్క సీటు కోసం రాజ్యాంగ విలువలను..బీజేపీ తుంగలో తొక్కింది: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
  • మీనాక్షి నామినేషన్​ను తిరస్కరించిన రిటర్నింగ్​ ఆఫీసర్​ది అధికార దుర్వినియోగమే
  • ఈ విషయంలో సీఎం మీద, నా మీద కొందరు చిల్లర ప్రచారం చేస్తున్నరు 
  • లీకు వీరులు, గ్రీకు వీరులు ఎవరో తేల్చేందుకు సీఎం విచారణ చేయిస్తున్నరు
  • ఒకవేళ బాధితురాలే ఈ సమాచారాన్ని లీక్ చేస్తే ఆమెపై క్రమశిక్షణ చర్యలు
  • షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసు ఇచ్చామన్న పీసీసీ చీఫ్

హైదరాబాద్, వెలుగు: మధ్యప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించి, తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడిన రిటర్నింగ్ అధికారి ( ఆర్వో)ను ఉరితీసినా తప్పులేదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. బీజేపీ ఒక్క సీటు కోసం కక్కుర్తిపడి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. గతంలో ఓట్ చోరీ చేశారని, ఇప్పుడు సీటు చోరీ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ఆర్వో దగ్గర కేంద్ర మంత్రులు, ఆ రాష్ట్ర మంత్రులు కూర్చొని నామినేషన్ ను తిరస్కరింపజేశారని ఆరోపించారు. ‘మీనాక్షి మీద తెలంగాణలో కేసే లేదు, ఎఫ్‌‌ఐఆర్ లేదు. కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఇచ్చింది. ఆ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. ఒక ప్రైవేట్ కేసును అడ్డంపెట్టుకొని కుట్రపూరితంగా ఆమె నామినేషన్ ను తిరస్కరించారని, ఆమెకు జరిగిన అన్యాయంపై చివరకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు సైతం బాధపడుతున్నారని పీసీసీ చీఫ్ అన్నారు. సుప్రీంకోర్టు తలుపు తట్టినా న్యాయం జరగకపోతే ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై న్యాయపరంగా, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఇప్పుడున్న 8 మంది ఎంపీలు ఓడిపోవడం ఖాయమన్నారు. 

మాపై కొందరు చిల్లర ప్రచారం

మీనాక్షి మాకు తోబుట్టువులాంటి వారని, ఆమె నామినేషన్ తిరస్కరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మీద, తన మీద కొందరు చిల్లర ప్రచారం చేస్తున్నారని మహేశ్​గౌడ్​ ఆరోపించారు. మీనాక్షి  విషయంలో లీకు వీరులెవరో తేల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయిస్తున్నారని చెప్పారు. ఒకవేళ బాధితురాలే ఈ సమాచారాన్ని లీక్ చేస్తే.. ఆమెపై పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.

బీఆర్ఎస్ పార్టీ వచ్చిందే ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేందుకని, ఆ పార్టీ రాజకీయాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గమనించాలని మహేశ్ గౌడ్ సూచించారు. కాంగ్రెస్ కు అన్ని రాష్ట్రాలూ సమానమేనని, తెలంగాణ, ఏపీ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని తాను ఇప్పటికే చెప్పానని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారని, బొగ్గు కుంభకోణంలో దోషులెవరో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఇక కాంగ్రెస్ కు మూడో స్థానమే అని కేటీఆర్ అనడంపై మహేశ్​గౌడ్​ తీవ్రంగా స్పందించారు. ఆయన పాదయాత్ర చేసేముందు పదేండ్లలో వారు చేసిన విధ్వంసం, ఆర్థిక దోపిడీ, అప్పులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిపై కక్షతోనే ఫ్యూచర్ సిటీని రద్దుచేసి అభివృద్ధిని అడ్డుకుంటామని కేటీఆర్ అంటున్నారని ఆరోపించారు. 

షబ్బీర్ ​అలీకి షోకాజ్​ నోటీసులు

కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి కూడా పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చిందని మహేశ్​ గౌడ్​ వెల్లడించారు. ఆయన తనపై ఆరోపణలు చేసినంత మాత్రాన ఆవేశపడబోనని స్పష్టం చేశారు. డబ్బులకు సీట్లు అమ్ముకున్నదెవరో షబ్బీర్ అలీ చెప్పాలన్నారు. మహిళలపై షబ్బీర్ అలా మాట్లాడాల్సింది కాదని, తానెప్పుడూ డబ్బుల కోసం రాజకీయం చేయలేదని చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డిని స్వయంగా షబ్బీర్ అలీయే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేర్పించారని పీసీసీ చీఫ్ గుర్తు చేశారు.