విమెన్స్ టీ20 వరల్డ్ కప్: ఇవాళ (జూన్ 14) పాకిస్తాన్తో హై ఓల్టేజ్ మ్యాచ్..

విమెన్స్ టీ20  వరల్డ్ కప్: ఇవాళ (జూన్ 14)  పాకిస్తాన్తో హై ఓల్టేజ్ మ్యాచ్..

బర్మింగ్‌‌‌‌హామ్: విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో హై ఓల్టేజ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే గ్రూప్‌‌‌‌–1 మ్యాచ్‌‌‌‌లో ఇండియా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌తో తలపడనుంది. ఇందులో గెలిచి టోర్నీలో శుభారంభం చేయడంతో పాటు రెండో ఐసీసీ ట్రోఫీ వేటను ఘనంగా మొదలుపెట్టాలని హర్మన్‌‌‌‌సేన లక్ష్యంగా పెట్టుకుంది. ఇరుజట్ల రికార్డులను పరిశీలిస్తే టీమిండియాకు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో ఇండియా 13–3తో పాక్‌‌‌‌పై లీడ్‌‌‌‌లో కొనసాగుతోంది. 

గత వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లోనూ ఇండియా 6 వికెట్ల తేడాతో పాక్‌‌‌‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌‌‌‌లోనూ ఇండియా గెలవాలంటే ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ చెలరేగాల్సిందే. కానీ గత కొన్ని మ్యాచ్‌‌‌‌ల్లో ఈ ఇద్దరు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై 82 పరుగులు చేసిన వైస్ కెప్టెన్ మంధాన.. ఆ తర్వాత ఆరు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో (13, 12, 37, 0, 32, 8) విఫలమైంది. షెఫాలీ వర్మ సౌతాఫ్రికాపై 64 పరుగులు చేశాక.. తర్వాతి ఐదు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో (9, 4, 2, 22, 11) తక్కువ రన్స్‌‌‌‌కే పరిమితమైంది. 

పాక్ బౌలింగ్‌‌‌‌ను దీటుగా ఎదుర్కోవాలంటే ఈ ఇద్దరు ఓపెనర్లు ఫామ్‌‌‌‌లోకి రావడం జట్టుకు అత్యంత అవసరం. కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్ ఇటీవలే సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌‌‌‌లపై హాఫ్‌‌‌‌ సెంచరీలు చేసి ఫామ్‌‌‌‌లోకి రావడం భారత మిడిలార్డర్‌‌‌‌కు కొండంత బలాన్ని ఇస్తోంది. కెప్టెన్‌‌‌‌తో పాటు జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, భారతి ఫుల్మాలి తమ బ్యాటింగ్‌‌‌‌తో స్కోరు బోర్డును పరుగెత్తించేందుకు సిద్ధంగా ఉన్నారు. 

వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా స్ట్రయిక్‌‌‌‌ రేట్‌‌‌‌ను మెరుగుపరుచుకోవాల్సి ఉంది. సీనియర్ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ దీప్తి శర్మ బ్యాటు, బంతితో రాణించడం జట్టుకు కీలకంగా మారనుంది. మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా అద్భుతమైన ఫామ్‌‌‌‌లో ఉంది. ఇటీవల జింబాబ్వేపై కేవలం 15 బంతుల్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన సనా.. బ్యాటింగ్‌‌‌‌లో 50 సగటు, బౌలింగ్‌‌‌‌లో 25 లోపు సగటుతో రాణిస్తోంది. గాయాల కారణంగా భారత బౌలర్లు అమన్‌‌‌‌జోత్ కౌర్, కశ్వీ గౌతమ్ ఈ టోర్నీకి దూరం కావడం భారత్‌‌‌‌కు కొంత మైనస్ కాగా.. పాక్ ఎడమచేతి వాటం స్పిన్నర్ నష్రా సంధును మన బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.