కిలో బొగ్గు కూడా పోయే చాన్స్ లేదు...సింగరేణిపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు: డిప్యూటీ సీఎం భట్టి

కిలో బొగ్గు కూడా పోయే చాన్స్ లేదు...సింగరేణిపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు: డిప్యూటీ సీఎం భట్టి
  • సింగరేణికి నష్టం చేసింది ఆ రెండు పార్టీలే 
  • కోల్ బ్లాకుల వేలంలో పాల్గొనకుండా చేశారు
  • గద్దల్ని,  డేగల్ని,  దళారుల్ని  సింగరేణిలో అడుగుపెట్టనివ్వం
  • మంచిర్యాలలో 335 మంది డిపెండెంట్లకు  అపాయింట్మెంట్ లెటర్లు అందజేత

మంచిర్యాల, వెలుగు:  సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటకు పోయే చాన్సే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణిపై మాజీ మంత్రి హరీశ్​రావు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ‘హరీశ్ రావు ఒక లేఖ రాస్తారు.. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి మాట్లాడుతుంటారు” అని విమర్శించారు. సింగరేణి సంస్థను బలహీనపరిచేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. శనివారం మంచిర్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో సింగరేణి వ్యాప్తంగా డిపెండెంట్ ఉద్యోగాలకు ఎంపికైన 335 మందికి అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ‘బీఆర్‌‌‌‌ఎస్ అధికారంలోకి వచ్చాక సింగరేణికి రావాల్సిన కోల్ బ్లాకులు రాకుండా కుట్రపూరితంగా అడ్డుకున్నారు. కోయగూడెం బ్లాక్ వేలంలో సింగరేణి పాల్గొనకపోవడం వల్ల దాదాపు 67 మిలియన్ టన్నుల బొగ్గును సంస్థ కోల్పోయింది. 

దీని మార్కెట్ విలువ దాదాపు రూ.29,106 కోట్లు, తద్వారా సింగరేణికి రావాల్సిన రూ.19,360 కోట్ల లాభం చేజారిపోయింది. ఈ బ్లాక్‌‌‌‌ను ఒక ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టారు. సత్తుపల్లి బ్లాక్-3 వేలంలో సింగరేణి పాల్గొనకుండా అడ్డుపడ్డారు. దీని వల్ల రూ.10,032 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లింది. దీని ద్వారా రావాల్సిన రూ.2,624 కోట్ల నికర లాభాన్ని సింగరేణి నష్టపోయింది” అని అన్నారు. వేలం నిబంధనల ప్రకారం బ్లాకులు దక్కించుకున్న వారు మైనింగ్ చేయలేకపోతున్నారని, గడువు కూడా ముగిసిపోయిందని చెప్పారు. ‘‘ఆ బ్లాకులను తిరిగి సింగరేణికే కేటాయించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని నేను రాతపూర్వకంగా కోరినప్పటికీ ఎందుకు ఇప్పించలేకపోతున్నారు’’ అని ప్రశ్నించారు. 

కోల్​బెల్ట్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి సింగరేణి కార్మికుల సమస్యలను చర్చించినట్లు భట్టి తెలిపారు. తక్షణమే మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డును ప్రారంభించి, చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే మారుపేర్ల  సమస్యపై లోతుగా స్టడీ చేసి భవిష్యత్తులో లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్, మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, గండ్ర సత్యనారాయణ, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్, కలెక్టర్ కుమార్ దీపక్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ అధ్యక్షులు జనక్ ప్రసాద్, వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

గూడెంగుట్టలో రూ.133 కోట్లతో అభివృద్ధి పనులు

దండేపల్లి, వెలుగు: రాష్ట్రభివృద్ధిలో రాజీపడేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్ట వద్ద రూ.133 కోట్ల తో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శనివారం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్ రావుతో కలిసి శంకుస్థాపనలు  చేశారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ గూడెంగుట్ట సత్యనారాయణస్వామి దేవాలయాన్ని అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. 

ఆలయ పునర్​ నిర్మాణం కోసం రూ.58 కోట్లు, గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం అదనంగా మరో రూ.12 కోట్లు విడుదల చేశామన్నారు. గూడెం, గుడిరేవు, ద్వారక, మోదెల గోదావరిపై మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపనలు చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఆధ్యాత్మికత,సాగునీటి రంగాల అభివృద్ధికి బహుముఖ వ్యూహంతో ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌‌‌‌సాగర్ రావును ఈ సందర్భంగా భట్టి విక్రమార్క అభినందించారు. అనంతరం గుట్ట పైకి వెళ్లి శ్రీ సత్యనారాయణ స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.