హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డిజిటల్ ఇన్నోవేషన్, డీప్ టెక్ రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి ఇన్నోవేషన్ కేంద్రంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. శనివారం హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ 2.0” సదస్సును మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగం ఏఐతో విప్లవాత్మక మార్పులకు లోనవుతోందని, ముఖ్యంగా ఆరోగ్య రంగం కీలక పరివర్తన దశలో ఉందని చెప్పారు. రీసెర్చ్, స్టార్టప్‌లు, పరిశ్రమలు, ప్రభుత్వ విధాన నిర్ణేతల మధ్య సమన్వయం పెరగాలని, అప్పుడే సామాన్యులకు మెరుగైన ఫలితాలు అందుతాయన్నారు. యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ.. వైద్య సేవల్లో కచ్చితత్వం, వేగం పెంచేందుకు ఏఐ ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.
వ్యాధులను ముందుగానే గుర్తించడం, రోగుల అవసరాలకు తగ్గట్టుగా ట్రీట్‌మెంట్ ఇవ్వడంలో ఏఐ అద్భుత ఫలితాలు ఇస్తోందని వివరించారు. సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్, ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ చినబాబు సుంకవల్లి మాట్లాడుతూ.. ఆరోగ్యరంగ భవిష్యత్తును ఏఐ పునర్నిర్వచిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ హెల్త్ టెక్ హబ్‌గా మార్చే దిశగా ఈ సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. సదస్సుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐఐటీ, ఐఎస్‌బీ వంటి సంస్థల నుంచి 2 వేల మందికి పైగా నిపుణులు హాజరయ్యారు.
