60 రోజుల నిబంధన ఎత్తేయండి..వీబీజీ రాంజీపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

60 రోజుల నిబంధన ఎత్తేయండి..వీబీజీ రాంజీపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
  • కొత్త నిబంధనలతో ఉపాధి కూలీలకు నష్టం: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయనున్న వీబీ జీ రాం జీ స్కీంపై రాష్ట్ర  ప్రభుత్వం నిరసన తెలియజేయాలని నిర్ణయించింది. ఈ స్కీమ్​ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నది. వీబీ జీ రాం జీ స్కీంను వ్యతిరేకిస్తూ శాసనసభలో ఇప్పటికే తీర్మానం చేసిన విషయం తెలిసిందే. జూలై 1 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలంటూ రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలను తెలియజేసింది.

ఈ మేరకు శనివారం ప్రజాభవన్‌‌లో అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ పనులు జరిగే సమయంలో 60 రోజులపాటు ఉపాధి పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్​చేస్తోంది. కొత్త విధానంతో ఉపాధి కూలీలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలోనే పెద్ద ఎత్తున వనమహోత్సవం, మొక్కలు నాటే కార్యక్రమాలు ఉంటాయని, ఈ సమయంలో ఉపాధి కూలీలకు విరామం విధిస్తే ఆ పనులన్నీ నిలిచిపోతాయని తెలిపారు. ఇది కేంద్రం చేపట్టిన 'గ్రీన్ ఇండియా' లక్ష్యానికే విఘాతం కలిగిస్తుందని చెప్పారు. కొండ ప్రాంతాలు, ఆదివాసీ గూడెల్లో వ్యవసాయ సీజన్ తక్కువ కాలం ఉంటుందని, అలాంటి ప్రాంతాల్లో ఈ నిబంధన ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా కొత్త స్కీమ్‌‌ను బలవంతంగా రుద్దితే కూలీలకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఉపాధి కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.