- రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్లు, సెన్సర్లు, రోబోటిక్స్ కీలకంగా మారుతున్నయ్
- ఊహించని సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు కేంద్ర మంత్రి పిలుపు
- దుండిగల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ల పరేడ్
- అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 231 మంది ఫ్లయింగ్ క్యాడెట్లు
- ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు
హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా యుద్ధవిధానాలు మారుతున్నాయని, భవిష్యత్తులో ఊహించని సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. ‘సంప్రదాయక యుద్ధంలో సైనికుడు, వారి ఆయుధాలు కనిపించేవి. ఆధునిక యుద్ధంలో మాత్రం శత్రువు, వారు ఉపయోగించే ఆయుధాలు కనిపించవు. అందుకే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. ప్రస్తుత యుద్ధాల్లో రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్లు, సెన్సార్లు, రోబోటిక్స్ వంటి వ్యవస్థలు కీలకంగా మారాయని, అందుకు తగ్గట్టుగా ఇండియన్ఎయిర్ ఫోర్స్సన్నద్ధం కావాలన్నారు. అత్యాధునిక, మైక్రో ఆయుధాలతో చిన్న దేశాలు కూడా పెద్ద దేశాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఉదాహరణలు ప్రపంచంలో కనిపిస్తున్నాయని గుర్తుచేశారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పైలట్ శిక్షణలో ప్రతిభ కనబరిచిన ఫ్లయింగ్ ఆఫీసర్లు ఆశిష్ కుమార్ యాదవ్‌కు 'ప్రెసిడెంట్స్ ప్లాక్' 'నవానగర్ స్వార్డ్ ఆఫ్ ఆనర్' ప్రదానం చేశారు. నావిగేషన్ విభాగంలో ఏక్తా గుప్తాకు, గ్రౌండ్ డ్యూటీ విభాగంలో దివ్యాంశి సింగ్‌కు 'ప్రెసిడెంట్స్ ప్లాక్' ప్రదానం చేశారు. ఫ్లైయింగ్, గ్రౌండ్‌డ్యూటీలో శిక్షణ పూర్తి చేసుకున్న 37 మంది మహిళా ఆఫీసర్లు సహా 231 మంది క్యాడెట్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ.. 2025 ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో భారత వాయుసేన అకుంఠిత స్ఫూర్తి, అసమానమైన శౌర్యం ప్రదర్శించింద కొనియాడారు.
భవిష్యత్ ఆపరేషన్లలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశించారు. భారత వైమానిక దళం దేశానికి కేవలం రక్షణ కవచమే కాక, అవసరమైనప్పుడు శత్రువుపై విరుచుకుపడే ఖడ్గంగా కూడా వ్యవహరించిందన్నారు. మైమానిక దళంలో మహిళల సంఖ్య పెరగడం పట్ల ప్రత్యేకంగా స్పందించిన రక్షణ మంత్రి, ‘నారీ శక్తి’ భాగస్వామ్యం ఐఏఎఫ్‌ను మరింత సమతుల్యంగా, శక్తివంతంగా మారుస్తుందని అన్నారు. ‘ఆకాశమే హద్దు కాదు.. ఆకాశమే మన ఇల్లు అనే దృక్పథంతో ముందుకు సాగాలి. అదే వికసిత భారత్ -2047 లక్ష్య సాధనకు దోహదం చేస్తుంది’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు
ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ ఆఫీసర్లు వారివారి కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకున్నారు. పరేడ్ సహా ఫ్లయింగ్‌లో తమ నైపుణ్యం ప్రదర్శించారు. పరేడ్ సందర్భంగా వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ నేతృత్వంలో జరిగిన ఫ్లైపాస్ట్ ఆహూతులను ఆకట్టుకుంది. పిలాటస్ పీసీ-7 ఎంఎక్-2, హాక్, కిరణ్, చేతక్ శిక్షణ విమానాలు ఆకాశంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించాయి. ‘ఆకాశ్ గంగా’ స్కైడైవింగ్ బృందం, ‘శక్తి’ ఉమెన్ ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్, సు-30 ఎంకేఐ యుద్ధ విమానం, సారంగ్ హెలికాప్టర్ డిస్‌ప్లే టీమ్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
