విద్యార్థులకు అలర్ట్: ఇంటర్ లో కీలక మార్పులు..ఈ ఏడాది నుంచే అమలు

విద్యార్థులకు అలర్ట్:  ఇంటర్ లో కీలక మార్పులు..ఈ ఏడాది నుంచే అమలు

తెలంగాణ ఇంటర్ లో ప్రభుత్వం  కీలక మార్పులు చేసింది.  ఇంటర్ ఫస్ట్ ఇయర్  నుంచే ప్రాక్టికల్స్  నిర్వహించనుంది.  ఇప్పటివరకు ఇంటర్ సెకండియర్‌లో మాత్రమే ఉన్న ప్రాక్టికల్స్.. ఇకపై ఫస్టియర్ నుంచే ప్రారంభం కానున్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రతి ఏడాది 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్‌కు కేటాయిస్తారు. దీనివల్ల విద్యార్థులకు మొదటి ఏడాది నుంచే టెక్నికల్ నాలెడ్జ్  పై పట్టు సాధించే అవకాశం  వస్తుంది.

మ్యాథ్స్ సబ్జెక్టులోనూ  మార్పులు  చేసింది విద్యాశాఖ. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్  విధానం ద్వారా ప్రతి ఏటా 15 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ రూపంలో కేటాయిస్తారు. దీనివల్ల ఫైనల్  ఎగ్జామ్ లో  మ్యాథ్స్ పేపర్ 75 మార్కులకు బదులుగా 60 మార్కులకే పరిమితం కానుంది. అంతేకాదు  ఫైనల్ ఎగ్జామ్ లో  100 మార్కుల నుంచి 80 మార్కులకు తగ్గించాలని బోర్డు నిర్ణయించింది. మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా కేటాయిస్తారు.

ఈ కొత్త విధానం భాషా సబ్జెక్టుల్లో కూడా అమల్లోకి రానుంది. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని, సృజనాత్మకతను పెంచడమే పరమావధిగా ఈ మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. బట్టీ పద్ధతిని తగ్గించి, ప్రయోగాత్మక నైపుణ్యాలకు పెద్దపీట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది బోర్డు.