హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్ ఎడ్యుకేషన్లో ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని 11 ప్రైవేట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలను తనిఖీ చేయగా, ప్రమాణాలు పాటించని 6 కాలేజీల అఫిలియేషన్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు. మరో నాలుగు కాలేజీల పనితీరునూ మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తున్నదని, ప్రమాణాలు పాటించకుంటే వాటిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.
గురువారం అసెంబ్లీలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలపై ప్రశ్న సందర్భంగా ఆయన జవాబిచ్చారు. మౌలిక వసతులు, ప్రయోగాత్మక పొలాలు, ల్యాబ్‌లు, టీచింగ్ ఫెసిలిటీ, ఫ్యాకల్టీ, స్టూడెంట్ల వసతి తదితర అంశాల్లో ప్రమాణాలు పాటించేలా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్నల్ మానిటరింగ్ కమిటీ, టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 4 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
