ఎప్‌‌‌‌సెట్‌‌‌‌ లో 5,053 మందికే సగానికి పైగా మార్కులు!

ఎప్‌‌‌‌సెట్‌‌‌‌ లో 5,053 మందికే సగానికి పైగా మార్కులు!
  • అగ్రికల్చర్​లో 2,879 మందికి 80 పైగా మార్కులు
  • ఇంజినీరింగ్‌‌‌‌లో 80 ప్లస్ వచ్చినోళ్లు 2,174 మందే..
  • టాప్ 100లో పాత విద్యార్థులు ఇద్దరే 
  • నార్మలైజేషన్ తర్వాత ‘సున్నా’ ఎవ్వరికీ రాలె

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీజీ ఎప్‌‌‌‌సెట్ ఫలితాల్లో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మొత్తం 160 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో సగం మార్కులు.. అంటే 80, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు రెండు విభాగాల్లో కలిపి కేవలం 5,053 మంది మాత్రమే ఉన్నారు. మార్కుల వేటలో ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ విద్యార్థులే మంచి పర్ఫామెన్స్ కనబరిచారు.  

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించి ఈ ఏడాది 84,954 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. అందులో 73,294 మంది క్వాలిఫై అయ్యారు. దీంట్లో 80కి పైగా మార్కులు సాధించిన వారు కేవలం 2,879 మంది ఉన్నారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌‌‌‌లో ఈ ఏడాది 1,97,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 1,44,704 మంది అర్హత సాధించారు. వీరిలో 80 ప్లస్ మార్కులు వచ్చిన వారు 2,174 మంది మాత్రమే.

అంటే పరీక్ష రాసిన వారిలో చాలా తక్కువ మంది విద్యార్థులు మాత్రమే సగానికి పైగా మార్కులు సాధించగలిగారు. మరోపక్క, ఎప్‌‌‌‌సెట్‌‌‌‌లో గతంలో ఇంటర్ పూర్తి చేసి.. మళ్లీ పరీక్ష రాసిన పాత విద్యార్థులు టాప్ ర్యాంకుల్లో చాలా తక్కువ మంది నిలిచారు. టాప్ వంద ర్యాంకుల్లో పాత విద్యార్థులు ఇద్దరే ఉండటం గమనార్హం. అంటే ఫ్రెష్‌‌‌‌గా ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులే టాప్ ర్యాంకులను పొందారు. 

ఇతర బోర్డులకు ర్యాంకులు తక్కువే.. 

టాప్ వెయ్యి జాబితాలో ఇతర బోర్డుల విద్యార్థులు (సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ, ఎన్​ఐఓఎస్) ఉన్నారు. సీబీఎస్ఈ బోర్డు నుంచి ఇంజినీరింగ్‌‌‌‌లో 44 మంది, అగ్రికల్చర్‌‌‌‌లో 57 మంది టాప్  1000లో నిలిచారు. ఐసీఎస్​ఈలో అగ్రికల్చర్‌‌‌‌లో ఒక్కరే వెయ్యిలోపు ర్యాంకు సాధించారు. ఎన్​ఐఓఎస్​ ఓపెన్ స్కూలింగ్ నుంచి అగ్రికల్చర్‌‌‌‌లో ఒకరు సత్తా చాటారు. ఇతర రాష్ట్రాల బోర్డుల నుంచి ఇంజినీరింగ్‌‌‌‌లో 29 మంది, అగ్రికల్చర్‌‌‌‌లో 21 మంది మొదటి వెయ్యి ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నారు. మిగిలిన వారంతా తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులే. 

నార్మలైజేషన్‌‌‌‌లో ‘సున్నా’ రాలేదు..

సాధారణంగా ఎంట్రన్స్ పరీక్షల్లో నార్మలైజేషన్ ప్రక్రియతో కొన్నిసార్లు మార్కులు తగ్గి సున్నా లేదా మైనస్‌‌‌‌లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ ఏడాది ఎప్‌‌‌‌సెట్ నార్మలైజేషన్ తర్వాత రెండు స్ట్రీమ్స్‌‌‌‌లోనూ సున్నా మార్కులు వచ్చిన వారు ఎవరూ లేకపోవడం గమనార్హం. 

ఎప్‌‌‌‌సెట్ 2026 - గణాంకాలు ఇవే..

అంశం                                  ఇంజినీరింగ్    అగ్రికల్చర్ & ఫార్మసీ

పరీక్ష రాసిన వారు                1,97,242                     84,954
అర్హత సాధించిన వారు        1,44,704                     73,294 
80కి పైగా మార్కులొచ్చినోళ్లు 2,174                          2,879
టాప్ 100లో పాత విద్యార్థులు    1                                  1
సున్నా మార్కులొచ్చినోళ్లు         0                                   0