మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుంటేనే సక్సెస్ : విశాక ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేక్

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుంటేనే సక్సెస్ : విశాక  ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేక్

మహిళలు తమకు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని విశాక ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేక్ పిలుపునిచ్చారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె..  మహిళల్లో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు భయం లేదా సంకోచంతో వెంటనే 'నో' చెప్పడం. ఆ ధోరణిని వీడి, ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. 2000 సంవత్సరంలో తాను విశాక ఇండస్ట్రీస్‌లో చేరానని, అప్పటి నుంచి కంపెనీ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు.

 విద్యార్థి దశ నుంచే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, అడ్డంకులను అధిగమించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆమె ఆ కళాశాల విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు.