V6 News

కాళీయమర్దనుడి అలంకారంలో నారసింహుడు

కాళీయమర్దనుడి అలంకారంలో  నారసింహుడు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారు కాళీయమర్ధనుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలు, నగలతో స్వామివారిని అలంకరించి తిరు వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు స్వామివారికి నిత్య పూజలు, ప్రధానాలయంలో నిత్య మూలమంత్ర హవనాలు, లక్షపుష్పార్చన జరిపారు. అనంతరం అలంకార సేవ ద్వారా యాగశాలలో ద్వారతోరణ పూజ చేసి, మూర్తికుంభారాధన, చతుస్థానార్చన, లక్ష్మీనారసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హోమాలు, నిత్య పూర్ణాహుతి చేపట్టారు.

జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం భువనగిరి మండలం రాయగిరికి చెందిన లలిత భక్త భజన మండలి, రామభక్త భజన మండలి, సద్గురు వారణాసి భజన మండలి బృందం సభ్యులు చేసిన భజన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కనకదుర్గ నృత్య విభావరి, మయూరి నాట్య కళాక్షేత్రం కళాకారులు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. నారసింహుడి జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామివారికి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ నిర్వహించనున్నారు. మరో వైపు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు సైతం సోమవారం ప్రారంభమయ్యాయి. స్వస్తివాచనం, విశ్వక్సేనపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.