- టర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల సొసైటీలో గౌరవ వేతనంతో పనిచేస్తున్న 11 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తూ ఇన్ చార్జి సెక్రటరీ శారద ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ మంగళవారం నుంచి విధులకు రాకూడదని స్పష్టం చేశారు. సొసైటీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వీరి గడువు ఈ ఏడాది నవంబర్ వరకు ఉంది. సాధారణంగా ప్రభుత్వ శాఖలు, అనుబంధ కార్పొరేషన్లు, సొసైటీల్లో గౌరవ వేతనం కింద ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటే గడువు పూర్తయ్యాక తొలగించాలి.
తర్వాత అవసరం అనుకుంటే పొడిగిస్తారు. ఇక్కడ మాత్రం 6 నెలల ముందే తొలగించడం వివాదాస్పదంగా మారింది. సోమవారం విధుల్లో ఉండగా మరో గంటలో డ్యూటీ పూర్తవడానికి ముందే ఆ 11 మందిని టర్మినేట్ చేస్తున్నామని అధికారులు చెప్పారు. దీంతో ఇన్ చార్జ్ సెక్రటరీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సిస్టమ్ అడ్మిన్, పోగ్రామర్స్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్, అకాడమిక్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు.
