భూమిని బ్లాక్‌హోల్‌ మింగేస్తదా?

భూమిని బ్లాక్‌హోల్‌ మింగేస్తదా?
    • నాగాలాండ్​కు చెందిన 12 ఏళ్ల స్టూడెంట్‌ ప్రశ్న
    • సమాధానమిచ్చిన ‘ది కన్వర్సేషన్’ వెబ్​సైట
  • భూమికి 3,300 కాంతి సంవత్సరాల దూరంలో                                                      

నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు.. ఇలా విశ్వంలో వింతలు, విశేషాలెన్నో ఉన్నాయి. విశ్వంలో అత్యంత పవర్​ఫుల్ ఏదని అడిగితే ‘బ్లాక్ హోల్’ అనే సమాధానం వినిపిస్తుంది. దేన్నయినా మింగేయగల శక్తి దానికుంది. ‘మరి ఏదైనా బ్లాక్ హోల్ వల్ల భూమికి ప్రమాదం ఏర్పడుతుందా?’.. ఇది పెద్ద పెద్ద సైంటిస్టుల మెదడుల్లో తలెత్తిన ప్రశ్న కాదు. నాసా రీసెర్చర్లు స్టడీ చేస్తున్న విషయమూ కాదు!! 12 ఏళ్ల స్టూడెంట్‌ అడిగిన ప్రశ్న.

భయపడాల్సిన పనిలేదు..

నాగాలాండ్​లోని దిమపూర్ కు చెందిన రకోవి అనే స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు ‘ది కన్వర్సేషన్’ సమాధానమిచ్చింది. బ్లాక్ హోల్ గురించి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే భూమిని ప్రభావితం చేసేంత దగ్గర్లో ఎలాంటి బ్లాక్​హోల్స్ లేవు. ‘వీ616 మోనోసెరోటిస్’ అనే బ్లాక్ హోల్ మాత్రమే మనకు దగ్గరగా ఉంది. దీన్ని ఏ0620-00 అని కూడా పిలుస్తున్నారు. ఇది సూర్యుడి కన్నా 6.6 రెట్లు పెద్దది. సూర్యుడికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పవర్ దీనికుంది. ‘వీ616 మోనోసెరోటిస్’కు మన భూమి 8 లక్షల కిలోమీటర్ల (3.7 కాంతి సెకన్లు) దగ్గరకు వెళ్తే.. అది లాగేసుకుంటుంది. భూమి ఎన్నటికీ అంత దగ్గరగా వెళ్లదు. ప్రస్తుతం ఆ బ్లాక్ హోల్​కు 3,300 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే కొన్ని కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరం. సూర్యుడు బ్లాక్ హోల్‌గా మారే అవకాశం లేదు. ఎందుకంటే కావలసిన ద్రవ్యరాశి సూర్యుడికి లేదు.

ఇంతకీ బ్లాక్ హోల్ అంటే..

కొన్ని కోట్ల సంవత్సరాలపాటు మండుతూ, ప్రకాశించిన నక్షత్రంలో కొంతకాలానికి హైడ్రోజన్ ఖర్చయిపోతుంది. దీంతో దాని చర్యలు ఆగిపోతాయి. శక్తి విడుదల కాదు. అప్పుడు కోర్(నక్షత్రం మధ్య భాగం)కు ఉండే గురుత్వాకర్షణ శక్తి వల్ల నక్షత్రం దానికదే కుచించుకుపోయి చిన్నగా బంతిలా మారుతుంది. తర్వాత విపరీతమైన ఒత్తిడి ఏర్పడి అది ఒక్కసారిగా పేలిపోతుంది. దీన్నే ‘సూపర్ నోవా’ అంటారు. ఇలా ఓ పెద్ద నక్షత్రం పేలినప్పుడే అది ఒక బ్లాక్ హోల్ గా మారుతుంది. అంటే శక్తి నశించి ‘చనిపోయిన’ భారీ నక్షత్రాలే బ్లాక్ హోల్స్ గా మారతాయి. వీటికి విశ్వంలోనే అత్యంత ఎక్కువ గురుత్వాకర్షణ బలం ఉంటుందని సైంటిస్టులు చెబుతారు. బ్లాక్ హోల్​కు ఉన్న ఈ బలం వల్ల తన దరిదాపుల్లోకి వచ్చిన దేన్నైనా మింగేస్తుంది. నక్షత్రం, గ్రహం.. ఇలా ఏదైనా సరే దగ్గరగా వచ్చిందంటే తనలోకి లాగేసుకుంటుంది.